Telangana new DGP: తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. తమకు రాబోయే కొత్త బాస్ ఎవరనే దాని గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. సీనియార్టీతో పాటు ..రేవంత్ ఐడియాలజీ కాలిక్యులేషన్స్‌తో ఎవరు సరిపోతారనే..చర్చ జరగుతోంది. ప్రస్తుత డీజీపీ డా. జితేందర్ ఈ నెల చివరిలో పదవీ విరమణ చేయనుండటంతో తెలంగాణ తదుపరి డీజీపీ ఎవరనే అంశంపై పోలీసు వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఈ కీలక పదవి కోసం సీనియర్ ఐపీఎస్ అధికారులు సీవీ. ఆనంద్ మరియు బీ. శివధర్ రెడ్డి మధ్య ప్రధాన పోటీ నెలకొంది. వీరిద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. పైగా తెలంగాణ రాష్ట్రానికి చెందినవారు కావడంతో ప్రభుత్వం ఎవరిని ఎంపిక చేస్తుందన్నది ఆసక్తిగా మారింది.
శివధర్ రెడ్డి వైపే మొగ్గు: ప్రస్తుతం ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న శివధర్ రెడ్డి వైపు ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఈయన 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ఉన్న సీవీ. ఆనంద్ 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఒకవేళ శివధర్ రెడ్డిని డీజీపీగా నియమిస్తే.. సీనియారిటీపరమైన ఇబ్బందులు రాకుండా ఉండేందుకు సీవీ. ఆనంద్‌కు విజిలెన్స్ డీజీతో పాటు ఏసీబీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనూ సి.వి. ఆనంద్ ఏసీబీ, విజిలెన్స్ డీజీగా పనిచేశారు.
Also Read:https://teluguprabha.net/telangana-news/ministers-advise-revanth-reddy-on-local-body-elections/
ఇతర కీలక పదవులకు పోటీ: సీవీ. ఆనంద్ బదిలీ అయితే.. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ పోస్టుకు తీవ్ర పోటీ నెలకొంది. ఆర్టీసీ ఎండీగా ఉన్న వీసీ. సజ్జనార్ (1996 బ్యాచ్ ఐపీఎస్), అడిషనల్ డీజీ (శాంతిభద్రతలు) మహేశ్ భగవత్ ఈ పోస్టు కోసం ప్రధానంగా పోటీ పడుతున్నారు. వీరితో పాటుగా చారు సిన్హా (సీఐడీ చీఫ్), డి.ఎస్. చౌహాన్, వై. నాగిరెడ్డి, స్వాతి లక్రా, సంజయ్ కుమార్ జైన్, మరియు స్టీఫెన్ రవీంద్ర వంటి సీనియర్ అధికారులు సైతం ఈ పదవికి అర్హతను కల్గి ఉన్నారు. సజ్జనార్ పేరు హైదరాబాద్ సీపీతో పాటు ఇంటెలిజెన్స్ డీజీ పోస్టుకు కూడా పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్ తర్వాత కీలకమైన సైబరాబాద్ కమిషనరేట్ సీపీ పోస్టుకు కూడా బదిలీ జరిగే అవకాశం ఉంది. ఈ పదవికి ఎస్‌ఐబీ చీఫ్ సుమతితో పాటు ఏసీబీలో పనిచేస్తున్న తరుణ్ జోషి పేర్లు వినిపిస్తున్నాయి.
పెద్ద ఎత్తున బదిలీలు!: డీజీపీ, సీపీలతో పాటు, పలు ఇతర కీలక విభాగాలకు చెందిన అధికారులు, జిల్లా ఎస్పీల వరకు పెద్ద ఎత్తున బదిలీలు జరిగే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దసరా పండుగ లోపే ఈ బదిలీల ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందని సమాచారం. ఈ బదిలీలు తెలంగాణ పోలీసు శాఖలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతాయని భావిస్తున్నారు.


