Rangam Bhavishyavani 2025: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల వేడుకల్లో భాగంగా కీలక ఘట్టమైన రంగం భవిష్యవాణి కార్యక్రమం ప్రారంభమైంది. మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ఈ సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ,రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
బోనాల ఉత్సవాలతో సంతృప్తి చెందారా అని అర్చకులు ప్రశ్నించగా మాతంగి స్వర్ణలత సమాధానం చెప్పారు. డప్పుచప్పుళ్లతో ఆనందోత్సాహాల నడుమ తనకు బోనాలు సమర్పించారని తెలిపారు. ప్రతి బోనాన్ని సంతోషంగా అందుకున్నానని పలికారు. అయితే ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా తనకు ఏదో ఒక ఆటంకం కల్పిస్తున్నారని మండిపడ్డారు.
వేల రాసుల కొద్దీ సంపాదనను రప్పించుకుంటున్నా.. కొద్దిగా కూడా తనకు దక్కడం లేదని ఆగ్రహించారు. తనకు సక్రమంగా పూజలు జరిపించడం లేదని.. అందుకే రోజురోజుకు మరణాలు పెరుగుతున్నాయని చెప్పారు. తాను కన్నెర్రజేస్తే రక్తం కక్కుకుని చస్తారంటూ హెచ్చరించారు. తల్లిదండ్రులు వాళ్ల పిల్లలను విచ్చలవిడిగా వదిలేస్తున్నారని ధ్వజెత్తారు. తనకు రక్తం బలి కావాలని.. తనను ప్రేమతో కొలిచేవారికి ఎప్పుడు తోడుగా ఉంటానని పేర్కొన్నారు. ఎవరు చేసిన తప్పునకు వారు ఫలితాన్ని అనుభవిస్తారన్నారు.
Also Read: రాష్ట్రంలో నేడు, రేపు ఎండలే.. మళ్ళీ వర్షాలు ఎప్పుడంటే..?
మిమ్మల్ని మహమ్మరి వెంటాడుతుందని.. అందరు అప్రమత్తంగా ఉండాలన్నారు. వరుస అగ్నిప్రమాదాలు జరుగుతాయని ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండుతాయన్నారు. ఐదు వారాల పాటు పప్పుబెల్లం, శాక, పసుపు కుంకుమ లతో కొంగు బంగారం చెయ్యండన్నారు. తనకు రక్తం చూపించకపోతే ఊరుకోనని హెచ్చరించారు. ప్రాణం తీయను కానీ రక్తం అయితే చూస్తారని మాతంగి భవిష్యవాణి వినిపించారు.
అమ్మవారి ప్రశ్నలకు ఆలయ ప్రధానార్చకుడు సమాధానిమచ్చారు. తాను దగ్గరుండి పూజలు చేయిస్తున్నానని తెలిపారు. ఇకపై ఎలాంటి పొరపాట్లు జరగనివ్వమబోమని తమను ఆశీర్వదించాలని వేడుకున్నారు. అర్చకుడు సమాధానంతో మాతంగి శాంతించారు. కాగా ఆదివారం అమ్మవారికి సీఎం రేవంత్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.


