తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో(Phone Tapping Case) మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ6గా ఉన్న శ్రవణ్ రావు(Shravan Rao) ఎట్టకేలకు పోలీసుల విచారణకు హాజరయ్యారు. గతేడాది మార్చి 10న పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు కాగానే ఆయన దేశం విడిచి వెళ్లిపోయారు. తొలుత లండన్ అక్కడి నుంచి అమెరికా వెళ్లి సిట్ విచారణకు రాకుండా తప్పించుకున్నారు. ఆయనను హైదరాబాద్ రప్పించేందుకు సీబీఐ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై శ్రవణ్‌రావును ముందస్తుగా అరెస్ట్ చేయవద్దని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. అదే సమయంలో విచారణకు సహకరించాలని స్పష్టం చేసింది. ఈ క్రమంలో శ్రవణ్‌రావు మార్చి 29న విచారణకు హాజరుకావాలని ఈ నెల 26న సిట్ నోటీసులు జారీ చేసింది. తొలిసారి సిట్ ముందుకు హాజరైన శ్రవణ్ రావు ఎలాంటి వాంగ్మూలం ఇవ్వనున్నారనే ఆసక్తిగా మారింది.
కాగా ఓ మీడియా సంస్థకు అధిపతిగా ఉన్న శ్రవణ్ రావు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కేంద్రంగా పలువురిపై నిఘా ఉంచారనే అభియోగాలు ఉన్నాయి. శ్రవణ్ రావు సూచన మేరకే కీలక నిందితులైన ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు(Prabhakar Rao), ప్రణీత్ రావు నడుచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రయోజనం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ అభ్యర్థులకు ఆర్థికంగా అండగా ఉన్న వ్యాపారులపై నిఘా ఉంచాలని శ్రవణ్ రావే సూచించినట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు.