తెలంగాణలో ఎండలు(Summer Alert) మండిపోతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఇక మధ్యాహ్నం 12 గంటలు అయితే చాలు మాడు పగిలిపోతుంది. దీంతో రోడ్లపైకి రావాలంటేనే జనం జంకుతున్నారు. మార్చి నెలలోనే ఇలా ఉంటే.. ఏప్రిల్, మే నెలలో ఎండలు ఇంకెలా ఉంటాయని ప్రజలు బెంబేలెత్తుతున్నారు. మార్చి నెలలోనే ఉష్ణోగ్రతలు(Temperatures) 40 డిగ్రీలకు పైగా చేరుకున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
సాధారణం కంటే 3.3 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయని వెల్లడించింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయని తెలిపింది. రానున్న రెండు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు పైగా నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాల్లో 39 డిగ్రీలు నమోదవుతున్నట్లు వెల్లడించింది. ఇక ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో ఎండ తీవ్రతతో పాటు వడగాలుల ప్రభావం అధికంగా ఉన్నట్లు పేర్కొంది. ఈ జిల్లాల్లో ఇప్పటికే ఎల్లో హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపింది.
అటు ఏపీలోనూ భానుడు భగభగమంటున్నాడు. కొన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వచ్చే మూడు రోజుల పాటు ఎండల తీవ్రత పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నారు. వడదెబ్బ తగలకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.