Today Rain in tg: రాష్ట్రంలో నేడు కూడా భారీ తుఫానులతో కూడిన వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నిన్నటిలాగే నేడు కూడా దక్షిణ, తూర్పు, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో మధ్యాహ్నం నుంచి రాత్రి సమయంలో చాలా తీవ్రమైన ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయన్నారు. ఇక హైదరాబాద్ లో నిన్నటి లాగే ఈరోజు కూడా మధ్యాహ్నం – రాత్రి సమయంలో తీవ్రమైన ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ ముందుగా చెప్పినట్టుగానే నిన్న సాయంకాలం నుండే రాష్ట్రంలోని పలు చోట్ల వర్షాలు ప్రారంభం అయ్యాయని చెప్పుకొచ్చారు.
భారీ వర్షపాతం నమోదైంది:
దక్షిణ, తూర్పు, మధ్య తెలంగాణ జిల్లాల్లో నిన్న విస్తృతంగా వర్షాలు కురిశాయి. నిన్నటి వర్షపాతం రంగారెడ్డి జిల్లాపై అత్యధిక ప్రభావం చూపింది. రాత్రిపూట 150 మి.మీ వరకు భారీ వర్షపాతం నమోదైంది. జిల్లాలో లోని తలకొండపల్లి లో కూడా 144 మి.మీ నమోదైంది. అలాగే మహబూబ్‌నగర్ లో రాత్రిపూట భారీ వర్షపాతం నమోదైంది. 60-100 మి.మీ వర్షం పడింది. కొన్ని చోట్ల 150 మి.మీ భారీ వర్షాలు కురిశాయి. జిల్లాలోని బాలానగర్ లో 115.8 మి.మీ భారీ వర్షపాతం నమోదైంది.
నేడు ఈ ప్రాంతాల్లో:
నాగర్‌కర్నూల్, నల్గొండ, వనపర్తి, గద్వాల్‌లో నేడు భారీ వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వాతావరణం మధ్యాహ్నం వరకు పొడిగా ఉన్న సాయంత్రం నుంచి రాత్రి వరకు వర్షాలు పుంజుకుంటాయి అని తెలిపారు. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే.. రాజేంద్రనగర్, శంషాబాద్, అత్తాపూర్, బాలాపూర్, సరూర్‌నగర్, చాంద్రాయణగుట్ట, గోల్కొండ, మణికొండ, నార్సింగి, గచ్చిబౌలి, నానక్‌రామ్‌గూడ వంటి సౌత్, వెస్ట్ హైదరాబాద్‌లో బలమైన వర్షాలు ఇతర ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.
గత కొన్ని వారాలుగా రాష్ట్రంలో చెప్పుకోదగ్గ వర్షాలు లేవన్న విషయం మీకు తెలిసిందే. వర్షాలు పడాల్సిన సమయంలో మాన్ సూన్ కు బ్రేక్ పడటం కాస్త నిరాశకు గురి చేసిందనే చెప్పాలి. అయితే వాతావరణ శాఖ అధికారులు సూచించినట్లే నేటి మళ్ళీ భారీ వర్షాలు కురుస్తాయని ప్రస్తుత వాతావరణ పరిస్థితులు చూసి చెప్పవచ్చు.


