Group1 Exams| తెలంగాణ గ్రూప్1 పరీక్షల నిర్వహణ వాయిదా వేయాలని కోరుతూ అభ్యర్థులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. హైదరాబాద్ అశోక్‌నగర్ చౌరస్తాలో శనివారం రాత్రి వరకు ఆందోళన నిర్వహించిన అభ్యర్థులు.. ఆదివారం ఉదయం కూడా భారీ ఎత్తున నిరసన చేపట్టారు. దీంతో పోలీసులు భారీగా మోహరించి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. జీవో 29తో ప్రభుత్వం పేద, బడుగు, బలహీన వర్గాల గొంతు కోస్తోందని అభ్యర్థులు మండిపడుతున్నారు. ఈ జీవో వల్ల రిజర్వేషన్ అభ్యర్థులు ఓపెన్ కేటగిరీలో ఉద్యోగం పొందే అర్హత లేదని వాపోతున్నారు. తాము ఇప్పటికే మానసికంగా కుంగిపోయినట్లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి తమను పిలిపించుకుని తమ గోడు వినాలని అభ్యర్థిస్తున్నారు.
ప్రతిపక్ష నాయకులతో మాట్లాడే బదులు తమతో మాట్లాడండని విజ్ఞప్తి చేస్తున్నారు. రాజకీయాలకు తాము అతీతమని.. కొన్ని సంవత్సరాలుగా కుటుంబాలకు దూరంగా గ్రూప్ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నామని.. దయచేసి తమకున్న చివరి అవకాశాన్ని చేజార్చకండని మొరపెట్టుకుంటున్నారు. శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న తమపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడం ఏంటని నిలదీస్తున్నారు. ఇదేనా మీరు చెప్పే ప్రజాపాలన అని ధ్వజమెత్తున్నారు. లాఠీఛార్జ్ వద్దని సీఎం చెప్పినా పోలీసులు వినడం లేదని అభ్యర్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు గాంధీభవన్ ముట్టడికి పిలుపునివ్వడంతో అక్కడ కూడా భారీగా పోలీసులు మోహరించారు.
అయితే ప్రభుత్వం మాత్రం గ్రూప్1 పరీక్షలు నిర్వహించి తీరుతామని స్పష్టంచేస్తోంది. అభ్యర్థులు అనవసరంగా ప్రతిపక్షాల రాజకీయ కుట్రలో భాగం కావొద్దని హెచ్చరిస్తోంది. ఇప్పటికే పలు మార్లు పరీక్షలు వాయిదా పడటంతో అనేక మంది నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని గుర్తుచేసింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం గ్రూప్1 పరీక్షలు నిర్వహిస్తున్నామని పేర్కొంది. మరోవైపు హైకోర్టు ఆదేశాలను అభ్యర్థులు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్‌పై సోమవారం ఉదయం సీజేఐ చంద్రచూడ్ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. అదే రోజు మధ్యాహ్నం 2.30గంటలకు పరీక్షలు ప్రారంభం కానున్నాయి. దీంతో సర్వోన్నత న్యాయస్థానం తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.