Today Hearing on BC reservations in High Court: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు రేవంత్ సర్కార్ చేస్తున్న ప్రయత్నాలను సవాలు చేస్తూ హైకోర్టులో పలువురు పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ చర్యలు సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమని పిటిషనర్లు పేర్కొన్నారు. అయితే ఈ పిటిషన్ నేడు జస్టిస్ కె.లక్ష్మణ్ ధర్మాసనం ఎదుట విచారణకు రానుంది.
50 శాతానికి సరిగ్గా సరిపోతుంది: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు చెందిన సామాజిక కార్యకర్త బుట్టెంగారి మాధవరెడ్డితోపాటుగా సిద్దిపేట జిల్లాకు చెందిన జలపల్లి మల్లవ్వ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదనే నిబంధనను ఉల్లంఘించేలా రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాలని చూస్తోందని వారు ఆరోపించారు. ప్రస్తుతం బీసీలకు 26 శాతం, ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 9 శాతం రిజర్వేషన్లు ఉన్నాయని తెలిపారు. ఈ మొత్తం 50 శాతానికి సరిగ్గా సరిపోతుందని వారు కోర్టుకు తెలిపారు.
సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధం: కె. కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పిటిషనర్లు తమ పిటిషన్‌లో ప్రస్తావించారు. రిజర్వేషన్లు ఏ కారణం చేతనైనా 50 శాతానికి మించకూడదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఉన్నట్లుగా వారు తెలిపారు. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లోనూ ఈ 50 శాతం పరిమితిని పొందుపరిచారని తెలిపారు. ప్రభుత్వం దానిని ఉల్లంఘించేలా జీవో జారీ చేయాలని చూడడం చట్ట విరుద్ధమని పిటిషనర్లు పేర్కొన్నారు.
ఇతర వర్గాలకు నష్టం: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తే.. మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటిపోతాయని అన్నారు. ఇది స్థానిక సంస్థల్లో పోటీ చేయాలనుకునే ఇతర వర్గాల అభ్యర్థుల హక్కులకు భంగం కలిగిస్తుందని పిటిషనర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ మొండి వైఖరి వల్ల.. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనాల ఉద్దేశం పూర్తిగా మారిపోతుందని పిటిషనర్లు పేర్కొన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక జీవో జారీ చేయడంతో పాటు ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదల చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ ప్రయత్నాలను నిలిపివేయాలని వారు కోర్టును కోరారు.


