Today Rain in tg: రాష్ట్రంలో నేడు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో నిన్న భారీ వర్షాలు కురిసాయి. చాలా ప్రాంతాలు వరదలతో నిండిపోయాయి. నిన్నటి లాగే నేడు కూడా ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, రంగారెడ్డి, నారాయణపేట, మహబూబ్‌నగర్, సిద్దిపేట వంటి పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో కూడా ఈరోజు మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వర్షాలు కురిసే ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఇతర ప్రాంతాల్లో సాయంత్రం నుంచి రాత్రి వరకు అడపాదడపా వర్షాలు పడతాయని అన్నారు. హైదరాబాద్ తో పాటు పరిసర ప్రాంతాల్లో వాతావరణం నిన్నటిలాగే మధ్యాహ్నం వరకు పొడిగా ఉంటుందని.. ఆ తర్వాత సాయంకాలం నుండి రాత్రి వరకు స్వల్ప వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
గత 2 రోజులతో పోలిస్తే, నేడు సాయంత్రం సమయంలో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అధికారులు వెల్లడించారు. మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో మాత్రం వాతావరణం పొడిగానే ఉంటుందని అన్నారు. శ్రీశైలం ఆనకట్ట నిండడానికి సమయం ప్రారంభం అయిందని పేర్కొన్నారు. సాధారణంగా ఇది ఆగస్టు/సెప్టెంబర్ నాటికి నిండే అవకాశాలు ఉండగా ఈసారి జూలై మొదటి వారంలోనే నిండే సూచనలు కనిపిస్తున్నాయని తెలిపారు.
గడిచిన 24 గంటల్లో:
గడిచిన 24 గంటల్లో మెదక్, సిద్దిపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసాయి. జనగాం, హన్మకొండలోని కొన్ని ప్రాంతాలు, వరంగల్, నారాయణపేట, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్ లలో చెదురుమదురు వర్షాలు పడ్డాయి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్ లలో మోస్తరు వర్షాలు కురిసాయి.
తెలంగాణలో జూన్ మొదటి వారంలోనే రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ, వాటి ప్రభావం అంతగా లేదు. ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితులు రుతుపవనాలు చురుకుగా మారడానికి అనుకూలంగా ఉన్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు విస్తరించి, రైతాంగానికి ఉపశమనం కలిగించే అవకాశం ఉంటుందని ఇప్పటికే వాతావరణ కేంద్రం తెలిపింది.


