Today Rain In TG: రుతుపవనాల విచ్ఛిన్నం కారణంగా తెలంగాణలో నేడు కూడా వర్షాలు లేవని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అనేక ప్రాంతాల్లో వాతావరణమంతా వేడి, తేమతో కూడి ఉంటుందని పేర్కొన్నారు. అయితే జూలై 16 తర్వాత వచ్చే భారీ వర్షాలకు సిద్ధంగా ఉండాలని మంచి కబురు చెప్పారు. ఎల్లుండి నుంచి హైదరాబాద్ నగరంతో సహా రాష్ట్రం లోని అన్ని జిల్లాల్లో వర్షాలు విస్తృతంగా కురవనున్నాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. నేడు కొన్ని చోట్ల చిరుజల్లులు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయని తెలిపారు.
రాష్ట్రంలో మాన్ సూన్ వర్షాలకు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. గడిచిన 24 గంటల్లో జూలైలో సాధారణ ఎండలకు మించిన ఎండలు కొట్టాయి. వాతావరణంలో మళ్ళీ వేడిమి పెరుగుదల వల్ల భారీ వర్షాలేమీ ఉండవు కానీ అక్కడక్కడా తేలికపాటి వర్షాలు మాత్రమే కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది జూలై 15 వరకు కొనసాగుతుందని పేర్కొంది. నిన్న.. నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి – కొత్తగూడెం లోని కొన్ని ప్రాంతాల్లో 38-40°C వరకు ఉష్ణోగ్రత నమోదైంది.
జూలై 16 తర్వాత తెలంగాణలో వర్షాలు పుంజుకుంటాయి అని చెబుతున్నా.. నేడు రేపు మాత్రం ఎండలు కొనసాగే అవకాశాలే కనిపిస్తున్నాయి.
జులై మొదట్లో రాష్ట్రంలోని మహబూబ్ నగర్, నారాయణపేట, నాగర్ కర్నూల్, ఆదిలాబాద్, ములుగు వంటి పలు జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు నమోదయ్యాయి. అయినప్పటికీ, హైదరాబాద్ వంటి కొన్ని ముఖ్య ప్రాంతాల్లో వర్షపాతం చాలా తక్కువగా ఉంది.
రుతుపవనాల ప్రభావం:
ప్రస్తుతం తెలంగాణపై నైరుతి రుతుపవనాల ప్రభావం ఉంది. అయినప్పటికీ, ఈ రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుండి రాష్ట్ర సగటు వర్షపాతం సాధారణ స్థాయి కంటే స్వల్పంగా తక్కువగా ఉన్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి.
మరోవైపు భారత వాతావరణ శాఖ (IMD) అంచనాల ప్రకారం చూసుకుంటే, రాబోయే 3-4 రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కొనసాగే అవకాశం ఉంది:
ఈ జూలై 18 వరకు: కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడవచ్చు.
హైదరాబాద్: రాజధాని హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లో పాక్షికంగా మేఘావృతమై, సాయంత్రం లేదా రాత్రి సమయంలో తేలికపాటి వర్షం లేదా చినుకులు పడవచ్చు. కొన్ని ప్రాంతాల్లో బలమైన ఉపరితల గాలులు (30-40 కి.మీ. వేగంతో) వీచే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. వర్షాలు, ముఖ్యంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.


