Young Lady Missing Case: పల్నాడు జిల్లాలో యువతి మిస్సింగ్ మిస్టరీ సినిమా ట్విస్ట్ లను తలపిస్తోంది. మొదటి యువతి చనిపోయిందని అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు.. ఇప్పుడు గుంటూరులో ఉందని గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. రొంపిచర్ల మండలం తుంగపాడు సమీపంలో శనివారం రాత్రి 10గంటల సమయంలో ద్విచక్ర వాహనంతో యువతితో వెళ్తున్న పాపారావును గుర్తుతెలియని వ్యక్తులు అడ్డుకున్నారని, తన ప్రియురాలిని సుబాబుల్ తోటలోకి లాక్కెళ్లారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే పోలీసులు ఘటన స్థలికి చేరుకొని వివరాలను సేకరించారు. అయితే శనివారం రాత్రి సుబాబుల్ తోటలో ఎంతవెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో పోలీసులు బాధితుడిపై అనుమానం వ్యక్తం చేస్తూ విచారించారు. విచారణలో పొంతనలేని సమాధానాలు చెప్పడంతో బాధితుడి నుంచి తమదైన శైలిలో విచారణ చేపట్టి వివరాలు రాబట్టారు.
కొంతకాలంగా పాపారావు, యువతి ప్రేమించుకుంటున్నట్లు సమాచారం. అయితే, పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తేవడంతో యువతిని ప్రియుడు పాపారావు హత్యచేసి ఉంటాడని పోలీసులు భావించారు. ప్రియుడు పాపారావు చెప్పిన ఆధారాలతో శనివారం రాత్రి సుబాబుల్ తోటలో గాలించారు. యువతిపై దాడిచేశానని పాపారావు ఒప్పుకోవటంతో ఆమె చనిపోయిందని పోలీసులు భావించారు. తోటలో ఎంత వెతికినా కొన్ని వస్తువులు తప్ప ఏమీ లభించలేదు. ఆదివారం ఉదయం .. గుంటూరులో యువతి ఉందని పోలీసులకు సమాచారం అందింది.
యువతి గుంటూరులో ఉంటే.. మరి ప్రియుడు పోలీసులతో ఎందుకు నేను దాడిచేశాను, ఆమెను చంపేశాను అని చెప్పాడనేది అర్థకాని పరిస్థితి. పోలీసులను పక్కదారి పట్టించేందుకే ప్రియుడు ఇలా ప్లాన్‌చేసి ఉంటాడా అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గుంటూరులో ఆచూకీ కనుగొన్న యువతిని, పాపారావును స్టేషన్ కు తరలించి విచారణ చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. వీరిని విచారిస్తే కానీ అసలు విషయం వెలుగులోకి వచ్చే అవకాశం లేదు. నిజంగానే గుర్తుతెలియని వ్యక్తులు యువతిని సబాబుల్ తోటలోకి లాక్కెళ్లారా? లేకుంటే.. ప్రియుడే యువతిని సుబాబుల్ తోటలోకి లాక్కెళ్లి హత్యాయత్నం చేశాడా? అసలేం జరిగింది అనే విషయాలపై స్పష్టత రావాలంటే వారిని విచారించిన తరువాతే తెలుస్తుందని పోలీసులు పేర్కొంటున్నారు.