రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు విజయసాయి రెడ్డి(Vijayasai Reddy) ప్రకటనపై ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత(Vangalapudi Anitha) స్పందించారు. విజయసాయి రెడ్డి కలలోకి గొడ్డలి వచ్చిందేమో.. అందుకే భయపడి రాజీనామా చేసి ఉండొచ్చని సెటైర్లు వేశారు. రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా, తప్పు చేసిన వాళ్లు శిక్ష అనుభవించాల్సిందేనని స్పష్టం చేశారు. రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని తాము అమలు చేస్తే.. వైసీపీ నేతలు ఈ 7 నెలలలో రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఉండేది కాదని తెలిపారు. గత ఐదేళ్లలో 4 సార్లు దావోస్ సమ్మిట్ జరిగితే జగన్ ఒక్కసారి వెళ్ళొచ్చారన్నారు. అప్పుడు కూడా తిరనాళ్ళలో తప్పిపోయిన పిల్లాడి లాగా బిత్తర చూపులు చూస్తూ.. ఇట్స్ లెంగ్తీ క్వషన్ అన్నారని ఎద్దేవా చేశారు.
మరోవైపు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. విజయసాయి రెడ్డికి ఆయన చేసిన పాపాలు కలలో కూడా గుర్తుకు వస్తూ ఉన్నట్లు ఉన్నాయన్నారు. ఆయన వ్యవసాయం చేస్తే పచ్చని ప్రకృతి కూడా కలుషితం అవుతుందని విమర్శించారు. విశాఖ నగరాన్ని నాశనం చేసిన విజయసాయి రెడ్డి.. చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబాన్ని వ్యక్తిగతంగా దూషించారని మండిపడ్డారు. తప్పు చేసిన వారికి చట్టపరంగా శిక్ష తప్పదని హెచ్చరించారు.