గుంటూరులోని ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్ 2025-26 అగ్నివీర్ రిక్రూట్‌మెంట్( Agniveer Army Recruitment) కోసం ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల అభ్యర్థుల కోసం రిజిస్ట్రేషన్ ప్రారంభించినట్లు గుంటూరులోని గుంటూరు ఆర్మీ రిక్రూటింగ్ కార్యాలయం వారు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
అందులో భాగంగా… వివిధ కేటగిరీలలో అగ్నివీర్‌ల యొక్క నియామకం కోసం రిజిస్ట్రేషన్‌ను www.joinindianarmy.nic. in ద్వారా చేయవచ్చన్నారు. రిజిస్ట్రేషన్ చివరి తేదీ 10 ఏప్రిల్ 2025 గా నిర్ణయించడమైనది. కాగా ప్రస్తుతం ఒక అభ్యర్థి అగ్నివీర్‌లో రెండు వేర్వేరు కేటగిరీలకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
ఆన్‌లైన్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (CEE) ను.. మొదటి సారిగా తెలుగుతో సహా 13 వేర్వేరు భాషలలో నిర్వహించబడుతోంది. NCC ‘A’, ‘B’ & ‘C’ సర్టిఫికేట్ హోల్డర్లు మరియు అన్ని కేటగిరీలకు మెరిటోరియస్ క్రీడాకారులకు మరియు అగ్నివీర్ టెక్నికల్ కేటగిరీకి ITI/ డిప్లొమా అర్హత సాధించిన అభ్యర్థులకు బోనస్ మార్కులు కూడా ఇవ్వబడతాయన్నారు.
గుంటూరు, కర్నూలు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, అనంతపురం, వైఎస్ఆర్ కడప, ప్రకాశం, చిత్తూరు, బాపట్ల, పల్నాడు, నంద్యాల, తిరుపతి, అన్నమయ్య మరియు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లాలకు చెందిన ఆసక్తిగల అభ్యర్థులందరూ అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్ అసిస్టెంట్, అగ్నివీర్ టెక్నికల్/అగ్నివీర్ ట్రేడ్స్‌మెన్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ఆటోమేటెడ్ విధానంలో పూర్తిగా పారదర్శకంగా నిర్వహించడం జరుగుతుందని, అగ్నివీర్‌గా సైన్యంలో చేరేందుకు నిర్వహిస్తున్న రిక్రూట్‌మెంట్ కోసం ఎక్కడా ఎటువంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉండదని అభ్యర్థులు గుర్తించుకోవాలని గుంటూరు ఆర్మీ రిక్రూట్మెంట్ కార్యాలయం వారు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.