రాష్ట్రంలో విద్యావ్యవస్థను మెరుగుపరిచేందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అనేక సంస్కరణలు తీసుకువస్తున్నారు. ఈ క్రమంలో పాఠశాల విద్యలో మరో కీలక నిర్ణయాన్ని ఆయన ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతి శనివారం ‘నో బ్యాగ్ డే’ (No Bag Day) అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సమగ్ర వికాసం లక్ష్యంగా అనేక చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు మూడో శనివారం మాత్రమే ఉన్న ‘నో బ్యాగ్ డే’ని వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతి శనివారం అమలు చేస్తామని చెప్పారు. ఆ రోజు విద్యార్థులకు క్విజ్‌లు, సమకాలీన అంశాలపై డిబేట్లు, సదస్సులు, క్రీడలు, వివిధ పోటీలు నిర్వహిస్తామని ఆయన ట్వీట్ చేశారు.
పాఠశాల క్రీడల్లో విద్యార్థినీ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్న వీడియోను లోకేశ్ షేర్ చేశారు. ఇందులో పలువురు ఉపాధ్యాయులు ‘నో బ్యాగ్ డే’ అమలు చేసిన తర్వాత పాఠశాలల్లో పరిస్థితులను వివరించారు. విద్యార్థినీ విద్యార్థులు ఉత్సాహంగా పాఠశాలకు వస్తున్నారని, హాజరు శాతం కూడా పెరిగిందని ఉపాధ్యాయులు వెల్లడించారు. లోకేశ్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అనేక మంది లోకేశ్ నిర్ణయాన్ని అభినందిస్తున్నారు. ఈ ట్వీట్‌కు గంటల వ్యవధిలోనే లక్షకు పైగా లైక్‌లు వచ్చాయి.