అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవారిని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బ్రాహ్మణి దంపతులు దర్శించుకున్నారు. శ్రీశైలం దర్శన పర్యటనలో భాగంగా ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా హైదరాబాదు నుంచి సుండిపెంట హెలిప్యాడ్ కు చేరుకున్నారు. సుండిపెంటకు చేరుకున్న నారా లోకేష్ దంపతులకు నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం మాజీ టిడిపి ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, భూమా అఖిల ప్రియ, భూమా బ్రహ్మానందరెడ్డి, ఏవి సుబ్బారెడ్డి, కార్యకర్తలు, నాయకులు ఘనస్వాగతం పలికారు. సుండిపెంట హైలిప్యాడ్ నుండి ప్రత్యేక కాన్వాయ్ ద్వారా రోడ్డు మార్గంలో మొదటగా శ్రీ సాక్షి గణపతి స్వామిని దర్శించుకొని అనంతరం శ్రీశైలం చేరుకున్నారు.
దర్శనార్థం శ్రీశైలం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతులకు ఆలయ మర్యాదలను అనుసరించి ఆలయ అర్చకస్వాములు ఏఈవో హరిదాస్, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం ద్వజస్తంభానికి నమస్కరించి, శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మ వారిని దర్శించుకుని, మల్లికార్జున స్వామికి రుద్రాభిషేకం, అమ్మ వారికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అనంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో లోకేష్ బ్రహ్మిని దంపతులకు అర్చకస్వాములు, వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా, ఆలయ అధికారులు శ్రీ స్వామి అమ్మవార్ల ప్రసాదాలు, స్వామి అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు.