జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఎక్కడికి వెళ్లినా ఆయన అభిమానులు తండోపతండాలుగా అక్కడికి వస్తుంటారు. ఒక్కసారైనా పవన్‌ను చూడాలని.. ఆయనను తాకాలని.. సెల్ఫీలు దిగాలని తాపత్రయపడుతుంటారు. అలాంటి మాస్ క్రేజ్ పవన్ సొంతం. అయితే ఓ బుడ్డోడికి మాత్రం ఏకంగా పవన్ భుజాల పైకి ఎక్కే అకాశం దక్కింది. కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా ఓర్వకల్లు మండలం పూడిచెర్ల బహిరంగ సభకు పవన్ చేరుకున్నారు. వేదిక పైకి వచ్చిన ఆయన అభిమానులకు అభివాదం చేస్తున్నారు.
ఇదే సమయంలో ఓ జనసేన కార్యకర్త తన కొడుకుని పవన్ కళ్యాణ్ దగ్గరకు తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నాడు. ఇది గమనించిన పవన్.. ఆ పిల్లాడ్ని పోలీసులు సహాయంతో వేదిక పైకి తెప్పించుకున్నారు. అనంతరం ఆ బుడ్డోడిని ఏకంగా తన భుజాలపై కూర్చోపెట్టుకున్నారు. అనంతరం ఎత్తుకొని ఆ పిల్లాడితో సరదాగా సంభాషించారు. ఇందుకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. మా అన్నయ్య బంగారం అంటూ జనసైనికులు కామెంట్స్ చేస్తున్నారు. హార్ట్ టచింగ్ మూమెంట్స్ అంటూ జనసేన పార్టీ కూడా ఎక్స్ వేదికగా ఈ వీడియోను పోస్ట్ చేసింది.