ఫిబ్రవరి 26న మహా శివరాత్రి వేడుకలకు ప్రముఖ శైవ క్షేత్రం శ్రీకాళహస్తి ముస్తాబవుతోంది. శ్రీకాళహస్తిలోని ముక్కంటి ఆలయంలో ఈ నెల 21 నుంచి మార్చి 6 వరకు బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలను స్థానిక టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అంగరంగ వైభవంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా స్వయంగా ప్రముఖులను కలిసి ఉత్సవాలకు ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు, హీరో నితిన్‌ను ఆహ్వానించారు.
తాజాగా మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)ని కలిశారు.హైదరాబాద్‌లోని ‘విశ్వంభర’ సినిమా సెట్స్ వద్దకు వెళ్లిన సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను చిరుకు అందజేశారు. శ్రీకాళహస్తీశ్వరుడి బ్రహ్మోత్సవాలతో పాటు గుడిమల్ల బ్రహ్మోత్సవాలకు కూడా కుటుంబసమేతంగా రావాలని చిరంజీవిని ఆహ్వానించారు. కాగా ప్రస్తుతం విశ్వంభరలో మెగాస్టార్ ఇంట్రడక్షన్ సాంగ్ చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.

