తిరుపతి(Tirupati)లోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద బుధవారం జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆరుగురు భక్తులు మృతి చెందిన సంగతి తెలిసిందే. పద్మావతి వైద్య కళాశాలలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను టీటీడీ ఈవో శ్యామలరావు(TTD EO Shyamala Rao) పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బైరాగిపట్టెడ కేంద్రం వద్ద ఉన్న బారికేడ్లు నిర్లక్ష్యంగా తెరవడం వల్లే తొక్కిసలాట జరిగినట్లుగా తమ దృష్టికి వచ్చిందన్నారు. ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోకుండా డీఎస్పీ రమణ కుమార్ బారికేడ్లు తొలగించడం వల్లే ఈ ఘటన జరిగినట్లు ప్రాథమికంగా తెలిసిందన్నారు. విచారణ తర్వాత పూర్తి వివరాలు వెల్లడవుతాయని తెలిపారు. ఈ ఘటనలో 41 మందికి గాయాలయ్యాయని చెప్పారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ఎవరికీ ప్రాణాపాయం లేదని తెలిపారు. ఇద్దరికి మాత్రమే తీవ్ర గాయాలయ్యాయని ఆయన చెప్పారు.