విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఈ పండగను జరుపుకోవాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, రాష్ట్రాభివృద్ధికి సంక్షేమం, సుపరిపాలన సమతుల్యంగా ఉండాలని తెలిపారు. “ప్రజలు ముందుకు” అనే నినాదంతో ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు. ప్రపంచం వేగంగా టెక్నాలజీ వైపు దూసుకెళ్తోందని ఆయన పేర్కొన్నారు. “ఇప్పుడు స్మార్ట్ వర్క్ కాలం.. వర్చువల్, ఫిజికల్ వర్క్ అనివార్యం అయ్యిందని తెలిపారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పారదర్శకతను పెంచామని వివరించారు. ఇప్పుడు క్వాంటం కంప్యూటింగ్, ఆర్టిఫిషయల్ ఇంటెలిజెన్స్ (AI) సహాయంతో మరింత ప్రగతి సాధించవచ్చు” అని అన్నారు.
ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్‌ను రూ. 3.22 లక్షల కోట్లుగా కేటాయించినట్టు పేర్కొన్న సీఎం, గత ఐదేళ్లలో ప్రజలకు ఎదురైన అవమానాలను గుర్తుచేశారు. “సంపద కొద్ది మందికి మాత్రమే పరిమితం కాకుండా, అందరికీ చేరే విధంగా చర్యలు తీసుకుంటాం. ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక విధానాలను అమలు చేస్తాం” అని వెల్లడించారు. అందరికీ మెరుగైన విద్య, వైద్యం అందించాలనే లక్ష్యంతో “మార్గదర్శి, బంగారు కుటుంబం, పీ4” వంటి కొత్త కార్యక్రమాలను త్వరలో ప్రారంభించనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు.