వైసీపీ రాజ్యసభ పదవికి విజయసాయి రెడ్డి(Vijayasai Reddy)రాజీనామా చేయడంపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) స్పందించారు. జగన్ విశ్వసనీయత కోల్పోయారు కాబట్టే విజయసాయి రెడ్డి వైసీపీ నుంచి వెళ్లిపోయారని తెలిపారు.
“విజయసాయి.. జగన్కు అత్యంత సన్నిహితుడు. జగన్ ఏ పని ఆదేశిస్తే అది చేయడం, ఎవరిని తిట్టమంటే వాళ్లను తిట్టడం అతని పని. రాజకీయంగా కాదు.. వ్యక్తిగతంగా కూడా నా బిడ్డల విషయంలో అబద్ధాలు చెప్పిన వ్యక్తి సాయిరెడ్డి. ఈ అబద్ధాలు జగన్ చెబితేనే అతను చెప్పారు. ఇలాంటి జగన్ సన్నిహితుడు రాజీనామా చేశాడంటే చిన్న విషయం కాదు. వైసీపీ కార్యకర్తలు, వైఎస్ అభిమానులు ఆలోచన చేయండి. జగన్.. విజయసాయిని వదిలేశారంటే ఎందుకు? సన్నిహితులు ఒక్కొక్కరుగా ఎందుకు బయటకు వెళ్తున్నారు? ప్రాణం పెట్టిన వాళ్లు ఎందుకు జగన్ను వీడుతున్నారు?
జగన్ నాయకుడిగా విశ్వసనీయత కోల్పోయారు. నాయకుడిగా ప్రజలను, నమ్ముకున్న వాళ్లను మోసం చేశారు. నా అనుకున్న వాళ్లను కాపాడుకోలేకపోతున్నారు. జగన్ బీజేపీ దత్తపుత్రుడు. – ఇన్నాళ్లు సాయి రెడ్డిని పక్కన పెట్టుకొని బీజేపీకి అనుకూలంగా ఉన్నాడు. జగన్ విశ్వసనీయత కోల్పోవడంతో సాయిరెడ్డి బయటకు వచ్చారు.. నిజాలు చెప్పాలి. గతంలో మీరు చెప్పినవన్నీ అబద్ధాలని మీకు తెలుసు. వివేకా హత్య విషయంలో నిజం చెప్పినందుకు సంతోషం. మిగతా విషయాలు కూడా బయటపెట్టాలి.” అని షర్మిల డిమాండ్ చేశారు.