Tax e-Filing: ఈరోజుల్లో చాలా మంది తక్కువ ఆదాయం ఉన్నప్పటికీ ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారు. కార్ లోన్, హోమ్ లోన్ వంటి పెద్ద రుణాలను పొందటానికి ఐటీఆర్ ఫైలింగ్ ఉపయోగపడటం దీనికి ఒక కారణం. చిన్న రిటర్న్స్ దాఖలు చేసే వ్యక్తులు సొంతంగానే తమ ఐటీఆర్ ఫైల్ చేసుకునేందుకు ఈఫైలింగ్ పోర్టల్ లో ముందుగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రక్రియను సులువుగా కొత్త పన్ను చెల్లింపుదారులు ఎలా పూర్తి చేయవచ్చు అనే అంశాలను దశలవారీగా చూద్దాం..
* ముందుగా www.incometax.gov.in అనే అధికారిక ఈ-ఫైలింగ్ పోర్టల్ వెబ్‌సైట్ ను ఓపెన్ చేయాలి.
* హోం పేజీలో ఉన్న “Register” అనే బటన్‌పై క్లిక్ చేయండి.
* “Register as Taxpayer” ఆప్షన్ ఎంచుకుని మీ పాన్ నంబర్‌ను ఎంటర్ చేసి “Validate” క్లిక్ చేయండి. పాన్ వివరాలు ముందుగానే రిజిస్టర్ అయితే స్కీన్ మీద ఎర్రర్ మెసేజ్ వస్తుంది.
* పాన్ వివరాలు వ్యాలిడేట్ అయిన తరువాత.. పాన్ కార్డులోని వివరాల ప్రకారం పేరు, పుట్టిన తేదీ, లింగం, రెసిడెన్షియల్ స్టేటస్ వంటి ప్రాథమిక వివరాలు ఎంటర్ చేయాలి.
* ఎంటర్ చేసిన వివరాలు సరిగా ఉన్నాయా లేదా తనిఖీ చేసి “Continue” క్లిక్ చేయాలి.
* కంటిన్యూ బటన్ నొక్కగానే.. మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి, అడ్రస్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది.
* దీని తర్వాత మీ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడికి వేరు వేరు 6 అంకెలతో కూడిన OTPలు వస్తాయి. వాటిని పోర్టల్ లో సరిగ్గా ఎంటర్ చేసి ధృవీకరించాలి.
* అన్ని వివరాలు ధృవీకరించిన తరువాత.. మీరు మీ అకౌంట్ కోసం ఒక పాస్‌వర్డ్ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. పాస్‌వర్డ్ 8 నుంచి 14 అక్షరాల మధ్య ఉండాలి. ఇందులో స్మాల్ లెటర్స్ అంలాగ్ క్యాపిటల్ లెటర్స్, నంబర్లు, ప్రత్యేక గుర్తులు (@, #, $, %) తప్పనిసరిగా ఉండాలి.
* పాస్‌వర్డ్ సెట్ చేసిన తర్వాత “Register” పై క్లిక్ చేయండి.
* రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయితే, “Proceed to Login” ద్వారా పేజీకి వెళ్లి లాగిన్ అవ్వండి.
పైన వివరించిన విధంగా ఒకసారి రిజిస్ట్రేషన్ అయ్యాక.. మీరు ఇ-ఫైలింగ్ ద్వారా సులువుగా టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయవచ్చు. అలాగే మీకు సంబంధించిన రీఫండ్స్ వివరాలను కూడా పోర్టల్ లో చూడవచ్చు, Form 26AS వంటి ఇతర సర్వీసులు పొందవచ్చు. పాన్ కార్డ్ ఆథార్ కార్డ్ లింక్ అయ్యుంటే ఈ ప్రాసెస్ మరింత సులభం అవుతుంది. తక్కువ సమయంలోనే మీరు రిజిస్ట్రేషన్ ఇంటివద్ద నుంచే పూర్తి చేసుకోవచ్చని గుర్తుంచుకోండి.


