Monday, September 16, 2024
Homeఓపన్ పేజ్New twists in Manipur crisis: మలుపులు తిరుగుతున్న మణిపూర్‌ సమస్య

New twists in Manipur crisis: మలుపులు తిరుగుతున్న మణిపూర్‌ సమస్య

మణిపూర్ లో ఏం జరుగుతోంది?


కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మణిపూర్‌ లో శాంతిభద్రతలను పునరుద్ధరించడానికి కొత్త కొత్త మార్గాలను అన్వేషిస్తుండగా, రాష్ట్రాన్ని నిప్పుల కొలిమిగా మార్చడానికి కుకీ-జో వర్గానికి చెందిన సంఘవిద్రోహ శక్తులు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. ఇంఫాల్‌ లోని పశ్చిమ జిల్లాలో మైతీలు ఎక్కువగా ఉండే గ్రామాల మీద కుకీ-జో వర్గానికి చెందిన విద్రోహులు డ్రోన్లతో దాడులు చేసి ఇద్దరి ప్రాణాలను బలి తీసుకోవడమే కాకుండా అనేక మందిని తీవ్రంగా గాయపరచడం జరిగింది. దీనిని బట్టి కుకీ-జో ఉగ్రవాదులు ఎంతకు తెగబడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. మైతీలు తమ ప్రాంతానికి వచ్చి తమపై దారికాచి దాడులు చేయడానికి ప్రయత్నించారని, దీనికి ప్రతీకారంగానే తాము డ్రోన్లతో దాడులు చేశామని కుకీల సంఘాలు ప్రకటించాయి. నిజానికి, మైతీలు కుకీల మీద దాడులు చేయడమన్నది ఇటీవల కాలంలో జరగనే లేదు. మయన్మార్‌ లో ప్రజాస్వామ్య అనుకూల చొరబాటుదార్లు అక్కడి సైనికులపై డ్రోన్లతోనే దాడులు చేయడం జరుగుతోంది. ఇక్కడ కుకీ-జో ఉగ్రవాదులు ఇదే పద్ధతిని అనుసరించడాన్ని బట్టి, ఇక్కడి అల్లర్లకు, హింసా విధ్వంసకాండలకు కారణమెవరన్నది గ్రహించవచ్చు.
రాష్ట్రంలో ఒక శాంతి ఒప్పందాన్ని కుదర్చుకోవడానికి ప్రయత్నాలు సాగిస్తున్నామని, అయితే గియితే ఆరు నెలల్లోగా మణిపూర్‌ లో ప్రశాంత పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్‌. బీరేన్‌ సింగ్‌ ప్రకటన చేసిన కొద్దిసేపటికే ఈ దాడులు జరగడాన్ని బట్టి కుకీ-జోమ ఉగ్రవాదులకు, ముఖ్యంగా మయన్మార్‌, బంగ్లాదేశ్‌ ల నుంచి వస్తున్న చొరబాటుదార్లకు ఇక్కడ ప్రశాంత పరిస్థితులు ఏర్పడడం ససేమిరా ఇష్టం లేదని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రశాంత పరిస్థితులు ఏర్పడకూడదనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి ఇటువంటి ప్రకటనలతో కుకీ-జో ఉగ్రవాదులను రెచ్చగొట్టడం జరిగిందంటూ కాంగ్రెస్‌ తదితర ప్రతిపక్షాలు ఘాటుగా విమర్శలు సాగించాయి. అంతేకాదు, కుకీ-జో ఉగ్రవాదులు డ్రోన్లతో దాడులు చేయబోతున్నారనే విషయాన్ని ఇంటెలిజెన్స్‌ వర్గాలు ముందుగానే పసికట్టలేకపోవడాన్ని, మణిపూర్‌ సమస్య ప్రారంభం అయి చాలా కాలమైనప్పటికీ భద్రతా దళాలు ఉగ్రవాదులను అణచివేయలేకపోవడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుబట్టాయి. డ్రోన్లతో దాడులు చేసిన దుండగుల కోసం పోలీసులు, భద్రతా దళాలు అణువణువునా గాలిస్తున్నాయి కానీ, ప్రభుత్వం ఈ చర్యలకు పరిమితం కాకూడదు. ఇక్కడి పర్వతాలు, లోయల్లో ఆశ్రయం పొందుతున్న ఉగ్రవాద వర్గాల ఆచూకీని కనిపెట్టడం, వారి దగ్గర నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకోవడం, వారికి ఆయుధ సంపత్తి అందకుండా చేయడం మీదే మణిపూర్‌ సమస్య పరిష్కారం ఆధారపడి ఉంది.

- Advertisement -

సుమారు 16 నెలలుగా రగులుతున్న మణిపూర్‌ సమస్యను పరిష్కరించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దగా చేస్తున్నదేమీ లేదని, శాంతిభద్రతలను పరిరక్షించడానికి ఎక్కువగా భద్రతా దళాలను ఉపయోగించడం, రాజకీయ సుస్థిరతను కాపాడడానికి శాయశక్తులా ప్రయత్నించడం తప్ప మరేమీ చేయడం లేదని ప్రతిపక్షాలు ఘాటుగా విమర్శిస్తున్నాయి. వివిధ వర్గాల మధ్య చర్చలకు అవకాశం కల్పించి, సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి కేంద్రంలోనూ, రాష్ట్రం లోనూ అధికారంలో ఉన్న బీజేపీ ఎటువంటి ప్రయత్నమూ చేయడం లేదని కూడా అవి విమర్శలు సాగిస్తున్నాయి. అయితే, ప్రభుత్వం వివిధ వర్గాల మధ్య అనేక పర్యాయాలు సమావేశాలు ఏర్పాటు చేయడం, మయన్మార్‌, బంగ్లాదేశ్‌ ల నుంచి చొరబాటుదార్లు మణిపూర్‌ లో ప్రవేశించకుండా అడ్డుకట్టలు వేయడం, పర్వతాలు, లోయల మధ్య స్థావరాలను ఏర్పాటు చేసి, ఇరు వర్గాల ప్రజల రాకపోకలకు, సంబంధాల మెరుగుదలకు తీవ్రంగా కృషి చేయడం జరుగుతోంది. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇరువర్గాలకు అనుకూలమైన విధానాలను, కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టడం కూడా జరుగుతోంది. గత లోక్‌ సభ ఎన్నికల్లో ఇక్కడి రెండు స్థానాల్లోనూ బీజేపీ పరాజయం పాలయిన తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మణిపూర్‌ సమస్య పరిష్కారానికి అనేక కార్యక్రమాలను చేపట్టాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా కుకీ-జో ఉగ్రవాదుల ఆధునిక స్థాయి దాడులను తిప్పికొట్టడానికి ఇప్పటికే సరికొత్త చర్యలను కూడా చేపట్టింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News