Tuesday, September 10, 2024
Homeఓపన్ పేజ్Sahithi Vanam: భయానక బందిపోటు చరిత్ర

Sahithi Vanam: భయానక బందిపోటు చరిత్ర

సుమారు 1840 ప్రాం‘కన్ఫెషన్స్‌ ఆఫ్‌ ఎ థగ్‌’ అనే పుస్తకాన్ని చదివిన వారికి ఒక అద్భుత నేర సంబంధమైన చరిత్ర కళ్లకు కడుతుంది. పదిహేనేళ్ల ప్రాయంలోనే లండన్‌ నుంచి ఇండియా వచ్చేసిన ఫిలిప్‌ మెడోస్‌ టైలర్‌ బొంబాయిలో ఒక చిన్న ఉద్యోగం చేస్తూ, చదువుకున్నాడు. కొద్ది కాలం బొంబాయిలో చిన్నా చితకా ఉద్యోగాలు చేసిన తర్వాత ఆయన హైదరాబాద్‌ వచ్చి నిజాం కొలువులో చేరాడు. ఇక్కడ నిజాం సైన్యంలో పని చేశాడు. ఆ ఉద్యోగం చేస్తూనే హిందీ, ఉర్దూ, తెలుగు, తమిళ భాషలు కూడా నేర్చుకుని ఆ తర్వాత సైనిక ఉద్యోగం నుంచి పోలీస్‌ ఉద్యోగానికి మారాడు. నాగపూర్‌లో జైళ్ల సూపరింటెండెంట్‌ పనిచేస్తూ రిటైరయి, ఆ తర్వాత జీవిత చరమాంకంలో లండన్‌ వెళ్లిపోయాడు. ఇంతకూ ఆయన ఒక పక్కన ఉద్యోగాలు చేస్తూనే మరొకపక్క మంచి పరిశోథక గ్రంథాలు కూడా రాయడం జరిగింది.
నాగపూర్‌లో జైళ్ల సూపరింటెండెంట్‌గా పనిచేస్తుండగా ఆయనకు ఒక సెల్‌లో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న అమీర్‌ అలీ అనే బందిపోటుతో పరిచయం కలిగింది. ఆ బందిపోటు కార్యకలాపాలు నాగపూర్‌ నుంచి చంబల్‌ లోయ వరకూ విస్తరించి ఉండేవి. అతనో బందిపోటు బృందానికి నాయకుడు కూడా. అందువల్ల అతని బంది పోటు కార్యకలాపాలను అతని నోటి నుంచే విని, ఆ అనుభవాలను టైలర్‌ గ్రంథస్థం చేయడం జరిగింది. అతని అనుభవాలు, కార్యకలాపాలు ఒక అద్భుతమైన క్రైమ్‌ థిల్లర్‌ను మరపిస్తాయి. ఈ గ్రంథం ఆ తర్వాత అనేక ప్రపంచ భాషల్లోకి అనువాదం అయింది. ఈ బందిపోటుకు దయాదాక్షిణ్యాలు లేశమాత్రంగానైనా ఉండేవి కావు. బందిపోటుగా మారిన తర్వాత, జైల్లో పడేవరకూ అతను 719 మందిని నిర్దాక్షిణ్యంగా హతమార్చాడు. ఎంతమందినో గ్రామ దేవతలకు బలి ఇచ్చాడు. ఎంత మంది మీదో అత్యాచారాలు జరిపాడు. ఎప్పుడు చూసినా అతని ఇల్లంతా బంగారు, వజ్రాల ఆభరణాలతో నిండిపోయి ఉండేది.
నిజానికి, అప్పటి బ్రిటిష్‌ పాలన పరిస్థితులను కూడా ఈ గ్రంథం వివరిస్తుంది. ఇటువంటి బందిపోట్లను నియంత్రించడానికి బ్రిటిష్‌ పాలకులు పెద్దగా చేసిందేమీ లేదు. దోపిడీకి గురైన వ్యక్తి బ్రిటిష్‌ పౌరుడు అయినప్పుడు మాత్రమే అధికారుల నుంచి స్పందన ఉండేది. అంతేకాక, ఈ బందిపోట్ల నుంచి బ్రిటిష్‌ అధికారులు ఇతరత్రా లబ్ధి పొందడం కూడా జరుగుతుండేది. తాను బాటసార్లను ఏ విధంగా ఏమార్చేదీ, ఏ విధంగా తమ స్థావరాలకు తీసుకువెళ్లి హతమార్చేదీ అమీర్‌ అలీ చిలవలు పలవలుగా, కథలు కథలుగా వివరించి చెబుతుంటే, టైలర్‌ రాసుకునేవాడు. ఈ పుస్తక రచనను పూర్తి చేయడానికి టైలర్‌కు దాదాపు ఏడాదిన్నర కాలం పట్టింది. మెడకు తువాలు చుట్టి చంపేయడం, భోజనంలో విషం పెట్టి చంపేయడం, నమ్మించి, గ్రామ దేవతలకు బలి ఇవ్వడం వంటి అనుభవాలను అతను టైలర్‌తో పంచుకున్నాడు.
బందిపోటు బృందంలోని సభ్యులు చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లి ముందుగానే బాటసారులకు లేదా యాత్రికులకు సంబంధించిన సమాచారం తీసుకు వచ్చేవారు. ఆ బాటసారి దగ్గర విలువైన వస్తువులు ఏం ఉన్నాయో, ఎంత ధనం ఉందో, వెంట ఎవరు వస్తున్నారో, అందులో మహిళలు ఎందరున్నారో ముందుగానే సమాచారం సేకరించిన తర్వాత అమీర్‌ అలీ దారి దోపిడీకి పథకం రూపొంచేవాడు. తామూ బాటసారుల్లాగా, భక్తుల్లాగా వేషాలు మార్చుకుని, భాషను కూడా వేషానికి తగ్గట్టుగా మార్చి అన్ని విధాలా సిద్ధంగా ఉండేవారు. సాధారణంగా బాటసారులు లేదా యాత్రికులు వీరి బారి నుంచి తప్పించుకోవడమన్నది జరిగేది కాదు. కొందరిని భోజనం చేస్తున్న సమయంలోనే ఉరేసి, గొంతుకు గుడ్డ చుట్టి చంపాల్సి వచ్చేదని అమీర్‌ అలీ చెప్పాడు. వృద్ధులు, మహిళలు, పిల్లలనే విచక్షణ కూడా వారికి ఉండేది కాదు. మొత్తం ఈ 719 మందిలో ఓ వంద మందిని హతమార్చిన తీరును అమీర్‌ అలీ ఈ గ్రంథంలో పూసగుచ్చినట్టు వివరించాడు. ఈ ఉదంతాలు చదువుతున్నప్పుడు ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఇది అప్పటి బందిపోటు చరిత్రకు, అప్పటి ప్రయాణాల చరిత్రకు, అన్నిటికీ మించి బ్రిటిష్‌వారి పాలన తీరుతెన్నులకు ఇది ఒక సాధికార ప్రమాణ పత్రం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News