Friday, November 22, 2024
Homeహెల్త్Dry skin: పొడిచర్మం పట్టులా అవాలంటే

Dry skin: పొడిచర్మం పట్టులా అవాలంటే

వేసవి అనగానే ఎన్నో ఎంజాయ్ మెంట్లు గుర్తుకువస్తాయి. మామిడిపండ్లు, ఐస్ క్రీములు, సినిమాలు, షికార్లు, టూర్లు, ఫ్రెండ్స్ తో ఫన్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కదా. వీటితో ఎక్కువ సేపు మన బయటే గడుపుతాం. వేసవి మనకు సరదాను, ఆనందాన్ని తెచ్చినా, ఈ సీజన్ లో చర్మంపై ఎండ వేడి చూపే దుష్ప్రభావం అంతా ఇంతా కాదు. చాలామంది పొడిచర్మంతో బాధపడతుంటారు. చర్మంపై దద్దుర్లు, మొటిమలు, యాక్నే వంటి సమస్యలు తలెత్తుతాయి. చర్మం టోన్ దెబ్బతింటుంది. పొడిచర్మంతో బాధపడేవాళ్లు స్కిన్ కేర్ రొటీన్ లో చేసే పొరబాట్లు కూడా వారి చర్మంపై తీవ్ర ప్రభావం చూపుతాయి.
ఉదాహరణకు చర్మంపై గట్టిగా రుద్దుతుంటారు. అలా చేయకూడదు. అన్ని రకాల చర్మం విషయంలో మాదిరిగానే పొడిచర్మం విషయంలోనూ చర్మంతో సున్నితంగా డీల్ చేయాలి. వేసవి కాలంలో అధిక వేడి ఉన్న నీళ్లతో స్నానం చేసినా చర్మం బాగా పొడారినట్టు అవుతుంది. పొడిచర్మం అని విపరీతంగా క్రీములు, లోషన్లు రాస్తుంటారు. మీ స్కిన్ కు పడని ఉత్పత్తులను సైతం వాడుతుంటారు. వేసవిలో చర్మంపై సూర్యరశ్మి ప్రభావం పడకుండా ఉండేందుకు, చర్మం బాగా పొడారిపోకుండా ఉండేందుకు ఇంట్లోనే తయారు చేసుకోగలిగే నేచురల్ ఫేస్ మాస్కులు చర్మంపై ఉపయోగిస్తే పొడిచర్మం సమస్య నుంచి బయటపడొచ్చంటున్నారు సౌందర్య నిపుణులు.
బొప్పాయి, తేనె మాస్కు పొడిచర్మంపై బాగా పనిచేస్తుంది. బొప్పాయి పావుముక్క తీసుకుని తొక్క తీసి దాన్ని బ్లెండర్ వేసి మెత్తటి గుజ్జులా చేయాలి. ఈ గుజ్జులో రెండు టేబుల్ స్పూన్ల తేనె, ఒక టీస్పూను పాల మీగడ వేసి బాగా కలిపి ఆ పేస్టును ముఖానికి రాసుకొని గంటసేపు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత గోరువెచ్చటి నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. చర్మం పట్టులా మెరుస్తుంది. గుడ్డు, ఆలివ్ ఆయిల్ ఫేస్ ప్యాక్ కూడా పొడిచర్మంపై మంచి ప్రభావం చూపుతుంది. ఒక గుడ్డును తీసుకుని పగలగొట్టి అందులోని సొనను చిక్కగా అయ్యేవరకూ కొట్టాలి. అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ ని వేసి బాగా కలపాలి.
ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంటసేపు అలాగే ఉంచుకొని ఆ తర్వాత గోరువెచ్చటి నీళ్లతో ముఖాన్ని బాగా కడుక్కోవాలి. ఇంట్లో చేసుకునే మరో ఫేస్ ప్యాక్ ఉంది. అదే పాలు, తేనె కలిపిన ఫేస్ ప్యాక్.
రెండు టేబుల్ స్పూన్ల పాలపొడి, ఒక టేబుల్ స్పూన్ తేనె, సరిపడా నీళ్లు మూడింటినీ బాగా కలిపి పేస్టులా చేయాలి. దాన్ని ముఖానికి పూసుకుని గంటపాటు అలాగే ఉంచాలి. అది బాగా ఆరిన తర్వాత చల్లటి నీళ్లతో ముఖం కడుక్కోవాలి. ఇంకొక నేచురల్ ఫేస్ ప్యాక్ అవకెడో, తేనె కలిపిన ఫేస్ ప్యాక్. అవకెడో పండు గుజ్జు తీసి దాన్ని బ్లెండర్ లో వేసి మెత్తగా చేయాలి. అందులో రెండు టేబుల్ స్పూన్ల తేనె కలిపి మెత్తటి పేస్టులా చేయాలి. దాన్ని ముఖానికి పట్టించి గంటసేపు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత గోరువెచ్చటి నీళ్లతో ముఖాన్ని కడుక్కోవాలి. ఈ ఫేస్ మాస్కులు రాసుకుంటే మీ పొడిచర్మం పట్టులా తయారవుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News