Saturday, September 21, 2024
Homeహెల్త్Hing for skin glow: చర్మాన్ని మెరిపించే ఇంగువ

Hing for skin glow: చర్మాన్ని మెరిపించే ఇంగువ

ఇంగువను చిటికెడు మాత్రమే వాడాలి

ఇంగువ వంటల్లో చిందించే ఘుమ ఘుమలు మనకు తెలుసు. అది అందించే ఆరోగ్య లాభాలూ మనకు తెలుసు. కానీ ఇంగువ చర్మ సౌందర్యానికి సైతం ఎంతో ఉపయోగపడుతుందని తెలుసా? దీన్ని తరచూ వంటపదార్థాల్లో వాడడం ద్వారా లేదా చర్మానికి నేరుగా అప్లైచేయడం ద్వారా పొందే ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. ఇంగువ చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. మచ్చలు లేకుండా అద్దంలా చర్మాన్ని ఉంచుతుంది. యాక్నే సమస్యను నివారిస్తుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఫేషియల్ టిష్యూలకు ఆక్సిజన్ అందేలా ఇంగువ చేయడం వల్ల చర్మం మిలమిల లాడుతుంది. కాంతివంతంగా తయారవుతుంది. కళ్ల కింద ఏర్పడ్డ నల్లటి వలయాలను సైతం ఇది పోగోడుతుంది. మీ చర్మం పట్టులా ఉండేలా చేస్తుంది. ఇందుకోసం మొదట చిటికెడు ఇంగువ పొడిని తీసుకుని పేస్టులా చేయాలి. తర్వాత ఒక టేబుల్ స్పూను పెరుగులో చిటికెడు ఇంగువ పేస్టును వేసి పేస్టులా చేయాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయాలి.

- Advertisement -

చిటికెడు ఇంగువలో కాస్త రోజ్ వాటర్, కొద్దిగా శాండల్ వుడ్ పొడి వేసి కలిపి పేస్టులా చేసి ఈ మిశ్రమాన్ని నిత్యం ముఖానికి రాసుకుంటే మీ చర్మం కాంతివంతమవుతుంది. వయసు మీద పడ్డప్పుడు చర్మం నల్లగా
అవడం సహజం. ఇంగువను వాడితే చర్మాన్ని నల్లగా చేసే కణాలు తగ్గుతాయి. దీంతో చర్మానికి నిగారింపు వస్తుంది. వయసు వల్ల చర్మంపై పడే ముడతలను, మచ్చలను, ఫైన్ లైన్స్ ను కూడా ఇంగువ తగ్గిస్తుంది. దీనికి మీరు చేయాల్సిందల్లా చిటికెడు ఇంగువ పొడి, కొద్దిగా తేనె తీసుకోవాలి. రెండింటినీ బాగా కలిపి ఆ
పేస్టును చర్మంపై సమస్య ఉన్న చోట అప్లై చేయాలి. ఇలా రోజుకు ఒకసారి చేయాలి. మేని ఛాయను పెంచే గుణాలు ఇంగువలో బాగా ఉన్నాయి. చర్మాన్ని కాంతివంతం చేయడంతో పాటు నల్ల మచ్చలను, జిడ్డును పోగొడుతుంది. చర్మంలోని టైరోసిన్ పెరగడం వల్ల చర్మం నల్లగా అవుతుంది. దీంతో వయసు మీదపడ్డట్టు కనిపిస్తారు. స్కిన్ కాంతివిహీనంగా కనిపిస్తుంది. అయితే ఇంగువకు చర్మంలో టైరోసిన్ ఉత్పత్తిని నియంత్రించే గుణం ఉంది. ఫలితంగా చర్మం ఎంతో నిగారింపును సంతరించుకుంటుంది.

ఇంగువను చర్మానికి అప్లై చేయడం వల్ల యూత్ ఫుల్ గా కూడా కనిపిస్తారు. ఇందుకు టొమాటో పేస్టును తీసుకుని అందులో షుగర్ వేసి బాగా కలపాలి. అలా కలపడం వల్ల టొమాటో పేస్టులో చక్కెర కలిసిపోతుంది. తర్వాత అందులో చిటికెడు ఇంగువపొడిని వేసి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. ఇంగువ ముఖంపై ఏర్పడ్డ యాక్నే, మొటిమలు, మచ్చలను పోగొట్టడంలో ఎంతో శక్తివంతంగా
పనిచేస్తుంది. చర్మంపై యాక్నేకు కారణమైన సూక్ష్మజీవులను, మురికిని నశింపచేస్తుంది. వీటి నివారణ కోసం ముల్తానీ మట్టి, రోజ్ వాటర్ లను తీసుకుని ఆ మిశ్రమంలో చిటికెడు ఇంగువ వేసి పేస్టులా చేయాలి. దెబ్బతిన్న చర్మ భాగంపై దాన్ని రాసుకోవాలి. ఇంగువలో తేనె కలిపి ఈ సమస్యలున్న చోట అప్లై చేస్తే కూడా మంచిది. ఈ పేస్టును వారానికి మూడుసార్లు చర్మానికి రాసుకుంటే చక్కటి ఫలితాలు చూస్తారు. మానసిక ఒత్తిడి, కాలుష్యం వల్ల చర్మం పొడిబారినట్టు అవుతుంది. ఇంగువ చర్మం డ్రైనెస్ ను పోగొట్టడంలో శక్తివంతమైన ఏజెంట్ గా పనిచేస్తుంది. చర్మంలోని పొడిబారే స్వభావాన్ని పోగొట్టి పట్టులా మ్రుదువుగా ఉండేలా చేస్తుంది. చర్మంపై కనిపించే డల్ నెస్, గరుకుదనం, మచ్చలు, ముడతలు, పిగ్మెంటేషన్ వంటివన్నీ చర్మాన్ని పొడిబారేలా చేస్తాయి. వీటన్నింటినీ కూడా ఇంగువ పోటొట్టి చర్మాన్ని కాంతివంతం చేస్తుంది.

ఒక గిన్నెలో పాలు, రోజ్ వాటర్ తీసుకుని అందులో కాస్త తేనె కూడా కలపాలి. ఆ మిశ్రమంలో పిసరు ఇంగువను కూడా వేసి మెత్తగా చేయాలి. దీన్ని నిత్యం అప్లై చేసుకోవడం వల్ల చర్మం యొక్క పొడిబారే గుణం పోయి పట్టులా తయారవుతుంది. ఇక్కడ గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే అన్నింటిలో ఇంగువను చిటికెడు మాత్రమే వాడాలి తప్ప ఎక్కువ పరిమాణంలో అస్సలు ఉపయోగించకూడదు. అలాగే ఇంగువను చర్మ సమస్యలకు వాడే ముందుర తప్పనిసరిగా ప్యాచ్ టెస్టు చేసుకోవాలి. అందులోనూ సున్నితమైన చర్మం ఉన్న వారు ఈ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. చర్మ నిపుణులను కూడా తప్పనిసరిగా సంప్రదించాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News