చలికాలంలో చిలకడదుంపలు తింటే…
చలికాలంలో చిలకడదుంపలు తింటే ఎంతో మంచిది. తీయగా, మరెంతో రుచిగా ఉండే ఈ దుంపలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కేరట్, బీట్రూట్, ఆకుకూరలు లాంటి కూరగాయలతో పాటు చలికాలంలో ఈ దుంపలు శరీరానికి చేసే మేలు కూడా ఎంతో.
చిలకడదుంపలు తెలుపు, ఆరంజ్, ఎరుపు, గులాబీ, వంకాయ, పసుపు ఇలా చాలా రంగుల్లో వస్తాయి. వీటిల్లో పోషక విలువలు పుష్కలం. ఫైబర్, యాంటాక్సిడెంట్లు, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి , ముఖ్యంగా బి6లతో పాటు పొటాషియం, మాంగనీసు వంటి ఖనిజాలు కూడా చిలకడదుంపల్లో ఎక్కువగా ఉంటాయి. ఇవి తింటే ఎంతో ఎనర్జిటిక్ గా ఉంటాం. వీటిల్లో పీచుపదార్థాలు ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణశక్తి బాగా పనిచేస్తుంది. వీటిని తిన్నప్పుడు కడుపు నిండినట్టు ఉండి తొందరగా ఆకలి వేయదు. క్రేవింగ్స్ ఉండవు.
అంతేకాదు ఇందులో సొల్యుబుల్, నాన్ సొల్యుబుల్ రెండురకాల పీచుపదార్థాలూ ఉన్నాయి. అందువల్ల మన జీర్ణకోశం ఆరోగ్యంగా కూడా ఉంటుంది. మలబద్దకం సమస్య తలెత్తదు. దీని గ్లైసిమిక్ ఇండెక్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. మీడియం సైజు ఉన్న ఒక చిలకడదుంపలో మీకు కేవలం 27 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయి. అందులో 53 శాతం స్టార్చే ఉంటుంది. ఇందులో 80 శాతం స్టార్చ్ తొందరగా అరిగిపోతుంది. తొమ్మిది శాతం మెల్లగా జీర్ణమవుతుంది. 11 శాతం రెసిస్టెంట్ స్టార్చ్ ఉంటుంది. వీటిని ఉడకబెట్టి తినడం వల్ల కావలసినంత శక్తి చాలా గంటల పాటు శరీరానికి అందుతుంది. అంతేకాదు చిలకడదుంపల్లో యాంటాక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉన్నాయి. వీటిల్లో ఎంతో బలమైన బేటా కెరొటినా యాంటాక్సిడెంట్ పుష్కలంగా ఉంది. పర్పుల్, ఆరంజ్ రంగుల్లో ఉండే చిలకడదుంపల్లో యాంథోసినిన్ అనే యాంటాక్సిడెంట్ బాగా ఉంది. ఆరంజ్ రంగులో ఉండే చిలకడదుంపలో బేటా కెరొటినా యాంటాక్సిడెంట్ అధికంగా ఉంది. ఇది కణాలు దెబ్బతినకుండా పరిరక్షిస్తుంది.
రోగనిరోధకశక్తిని కూడా చిలకడదుంపలు పెంపొందిస్తాయి. వీటిని చాట్స్ నుంచి ఫ్రైస్ దాకా, అలాగే హల్వాలాంటి వంటకాలెన్నింటిలోనో వాడతారు. చిలకడదుంపల్లో ఎన్నో పోషకవిలువలు ఉన్నాయి. అయితే శీతాకాలంలో మీరు తినే డైట్ సమతుల్యంగా ఉండాలంటే వీటిని ఆహారంలో తప్పకుండా ఉండేలా చూసుకోవాలి. చిలకడదుంపలు కంటి చూపుకు కూడా ఎంతో మంచి చేస్తాయి. మధుమేహాన్ని నియంత్రిస్తాయి. కాన్సర్ పాలబడకుండా తోడ్పడతాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. మెదడు చురుగ్గా పనిచేసేలా తోడ్పడతాయి. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. చిలకడదుంపల్లో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్, యాంటాక్సిడెంట్లు చర్మం, శిరోజాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. ముఖ్యంగా చర్మాన్ని కాంతివంతం చేస్తాయి. శిరోజాలను నల్లగా నిగనిగలాడేలా చేస్తాయి.