Elon Musk: ట్విటర్ యాజమాని ఎలాన్ మస్క్ శుక్రవారం కీలక ప్రకటన చేశాడు. ట్విటర్ వేదికగా త్వరలో బ్లూ వెరిఫైడ్ సేవలను అందుబాటులోకి తెస్తున్నామని, అయితే ఈసారి మూడు కలర్స్ లో ఇవి మీకు అందుబాటులో ఉంటాయని మస్క్ తెలిపారు మస్క్ చేతికి ట్విటర్ రాకముందు ప్రభుత్వ అధిపతులు, క్రికెటర్లు, సినీతారలు, ఇతర సెలబ్రిటీల ఖాతా వివరాలను తనిఖీ చేశాకే బ్లూటిక్ ఇచ్చేవారు. మస్క్ ట్విటర్‌ను తన చేతుల్లోకి తీసుకున్న తరువాత ప్రతీఒక్కరూ బ్లూ టిక్ సేవలను పొందవచ్చునని, అయితే అందుకోసం నెలకు 8డాలర్లు చెల్లించాలని మస్క్ కొత్తరూల్‌ను అమల్లోకి తెచ్చాడు.
మస్క్ ప్రకటనతో లక్షలాది మంది బ్లూటిక్ సేవలను పొందారు. అయితే, ఇందులో సగానికిసగం నకిలీవని ఫిర్యాదులు రావడంతో ఆ సేవలను ట్విటర్ నిలిపివేసింది. వారం రోజుల్లో అందుబాటులోకి తెస్తామని మస్క్ ప్రకటించినప్పటికీ బ్లూవెరిపైడ్ సేవలు అందుబాటులోకి రాలేదు. తాజాగా మస్క్ కీలక ప్రకటన చేశారు. వచ్చే శుక్రవారం (డిసెంబర్2) నుంచి తాత్కాలిక ప్రాతిపదికన బ్లూ వెరిఫైడ్ ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు తెలిపాడు.
ఈసారి గోల్డ్, గ్రే కలర్స్‌లోనూ బ్లూ వెరిఫైడ్ సేవలు అందుబాటులోకి వస్తాయని మస్క్ అన్నారు. కంపెనీలకు గోల్డ్, ప్రభుత్వ ఖాతాలకు గ్రే, సెలబ్రిటీలు, ఇతర వ్యక్తులకు బ్లూ వెరిఫైడ్ ఇవ్వనున్నామని మస్ తెలిపారు. వీటినికూడా ఖాతాదారుల వివరాలను పూర్తిగా తనిఖీ చేసిన తరువాతనే వెరిఫైడ్ టిక్‌ను కేటాయిస్తామని మస్క్ ట్విటర్ ద్వారా తెలిపాడు. పూర్తి వివరాలను వచ్చేవారం వెల్లడిస్తామని, హింసను ప్రేరేపించే ఖాతాలను సస్పెండ్ చేస్తామని మస్క్ తెలిపాడు.