AP liquor scam : ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసు విచారణలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు ఈ కేసులో అరెస్ట్ కాగా, సిట్ దాఖలు చేసిన ఛార్జ్ షీట్లలో ముఖ్యమంత్రి జగన్ ప్రమేయంపై కూడా ప్రస్తావన ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దర్యాప్తులో ఇప్పుడు జగన్ సోదరుడు వై.ఎస్. అనిల్ రెడ్డి (జగన్ పెదనాన్న వైఎస్ జార్జిరెడ్డి కుమారుడు) పాత్రపై సిట్ అధికారులు దృష్టి సారించారు.
రూ. 50-60 కోట్ల ముడుపుల వ్యవహారంలో అనిల్ రెడ్డి పేరు
మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీల నుంచి ప్రధాన నిందితుడు రాజ్ కేసీరెడ్డి ప్రతినెలా రూ. 50-60 కోట్ల మేర ముడుపులు వసూలు చేసినట్లు సిట్ గుర్తించింది. ఈ భారీ ఆర్థిక లావాదేవీల వెనుక అనిల్ రెడ్డి పాత్ర ఉన్నట్లు కీలక ఆధారాలు లభ్యమైనట్లు సమాచారం. రిమాండ్ రిపోర్టులలో కూడా సిట్ ఈ అంశాన్ని ప్రస్తావించింది. ముడుపుల సొమ్ము రాజ్ కేసీరెడ్డి నుంచి అనిల్ రెడ్డికి ఎలా చేరింది, ఆ సొమ్ము ఎవరెవరి ద్వారా, ఎక్కడికి తరలిందనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.
కీలకమైన దేవరాజు విచారణ
ఈ వ్యవహారంలో అనిల్ రెడ్డి పీఏ దేవరాజు కీలకంగా వ్యవహరించినట్లు సిట్ అధికారులు గుర్తించారు. కేసులోని నిందితులందరితోనూ అతను నిరంతరం సంప్రదింపుల్లో ఉన్నట్లు నిర్ధారించారు. మూడు రోజులుగా దేవరాజును విచారిస్తున్న సిట్ అధికారులు, సేకరించిన సాంకేతిక ఆధారాలను చూపించడంతో అతను సమాధానాలు దాటవేసినట్లు తెలుస్తోంది. అనిల్ రెడ్డి, జగన్‌కు అత్యంత సన్నిహితుడు కావడంతో ఆయన పాత్రపై సిట్ లోతైన దర్యాప్తు చేస్తోంది. గతంలో ఇసుక దందా వ్యవహారంలోనూ అనిల్ రెడ్డి పేరు వినిపించడంతో, ఈ కేసు దర్యాప్తు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.


