ఛాంపియన్స్ ట్రోఫీ-2025 కోసం క్రీడా అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఫిబ్రవరి 19న ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఈ టోర్నీకి పాకిస్థాన్ ఆతిథ్యమిస్తుండగా టీమిండియా ఆడే మ్యాచ్ లను దుబాయ్ లో నిర్వహించేలా షెడ్యూల్ రూపొందించారు. ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లు శనివారం రాత్రి దుబాయ్ చేరుకున్నారు. వారికి దుబాయ్ లో ఘన స్వాగతం లభించింది. దీనికి సంబంధించిన వీడియో బీసీసీఐ అధికారిక ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కోహ్లీ, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అక్షర్ పటేల్, అర్ష్ దీప్ సింగ్ లతోపాటు అసిస్టెంట్ కోచ్ లు ర్యాన్ టెన్ డోస్చెట్, అభిషేక్ నాయర్, బౌలింగ్ కోచ్ మోర్నే మార్కెల్, ఫీల్డింగ్ కోచ్ దిలీప్ లు ఈ వీడియోలో ఉన్నారు. మిగిలిన వారు ఆదివారం దుబాయ్ చేరుకోనున్నట్లు తెలిసింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో కెప్టెన్ రోహిత్ శర్మ సహాయక సిబ్బందిని ఏదో అడుగుతున్నట్లు వీడియో ఉంది. బస్సు ఎక్కే సమయంలో బస్సు డోర్ వద్ద రోహిత్ నిలబడి ఉండగా.. సహాయక సిబ్బందిలో ఒక సభ్యుడు అతని వద్దకు పరుగెత్తుకుంటూ వచ్చాడు. అయితే, అతడికి రోహిత్ ఏదో చెప్పగా.. అతను కాస్త కంగారుగా కనిపించాడు. రోహిత్ ఏదో మర్చిపోగా.. దానికి సంబంధించిన వివరాలను సిబ్బందికి చెబుతున్నట్లు వీడియోను బట్టి అర్థమవుతుంది.
ఛాంపియన్స్ ట్రోఫీ 19న ప్రారంభం కానుండగా.. ఫిబ్రవరి 20వ తేదీన బంగ్లాదేశ్ జట్టుతో టీమిండియా తొలి మ్యాచ్ ఆడనుంది. ఫిబ్రవరి 23న దాయాది పాకిస్థాన్ జట్టుతో రోహిత్ సేన తలపడనుంది. మార్చి 2వ తేదీన న్యూజిలాండ్ జట్టుతో ఆడనుంది. ఇక ప్రస్తుతం టీమిండియా అద్భుత ఫాంలో కనిపిస్తోంది. తాజాగా స్వదేశంలో ఇంగ్లాండ్ తో జరిగిన వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. అంతకు ముందు టీ20 సిరీస్ ను కూడా భారత్ గెలుచుకుంది.