Telangana weather updates: చలి తీవ్రత రాష్ట్రాన్ని ఇప్పటికే గజగజలాడిస్తోంది. ఆదివారం ఈ తీవ్రత మరింత పెరిగింది. అంతే కాకండా సోమ, మంగళ, బుధవారాల్లో చలి ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. సాధారణం కన్నా మూడు నుంచి నాలుగు డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు తక్కువ నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఈ ఏడాది అధిక వర్షాలు కురవడం, ప్రస్తుతం ఉత్తర, ఈశాన్య ప్రాంతాల నుంచి దిగువ స్థాయి గాలులు రాష్ట్రం వైపు వీస్తుండటం వంటి కారణాలతో చలి తీవ్రత అధికంగా ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు: ఎముకలు కొరికే చలి కారణంగా రాష్ట్రవ్యాప్తంగా సాధారణ ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. గత వారం రోజులుగా రాష్ట్రంలో కనిష్ఠ, గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా తక్కువ నమోదవుతూ వస్తున్నాయి. శనివారం రాత్రి నుంచి ఆదివారం వేకువజాము వరకు పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయి. హైదరాబాద్‌లో సైతం చలి తీవ్రత విపరీతంగా ఉంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లాలోని కోహిర్‌లో 7.8 డిగ్రీల సెల్సియస్ అత్యల్ప కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. గతంలో నవంబర్ 2016లో మోమిన్‌పేటలో నమోదైన 7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత రికార్డుకు ఇది చేరువైంది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్‌లో 8.1, వికారాబాద్ జిల్లా, మోమిన్‌పేటలో 8.5, రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నంలో 8.8 డిగ్రీల సెల్సియస్ చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు 7.8 నుంచి 13.9 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి.
ఇబ్బంది పడుతున్న వాహనదారులు: సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు దట్టమైన పొగమంచు రహదారులను కమ్ముకుంటుంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో విజిబిలిటీ గణనీయంగా తగ్గుతోంది. రాబోయే రోజుల్లో తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 – 4 డిగ్రీలు తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు ఈశాన్య దిశ నుంచి గంటకు 4-6 కి.మీ వేగంతో వీచే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది.
చలితో వణికిపోతున్న మున్సిపల్ కార్మికులు: తెల్లవారుజామున చలికి తోడు దట్టమైన మంచు కురుస్తుండటంతో.. ఆ సమయంలో పనులు చేసుకునేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పాల వ్యాపారులు, కూరగాయల రైతులు, మున్సిపల్ కార్మికులు చలితో వణికిపోతున్నారు. మార్నింగ్ వాకర్స్, అయ్యప్ప భక్తులు, కార్తీక మాసం వేళ తెల్లవారుజామున పూజలు చేసుకునే మహిళలు, పేపర్‌బాయ్‌లు, ప్రయాణం చేసేవారు, అలాగే ఆర్టీసీ డ్రైవర్‌లు చలితో తెగ ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా బడికి పిల్లలను పంపించే తల్లులు సైతం ఈ చలికి తట్టుకోలేక పోతున్నారు. అయితే వాతావరణ శాఖ అంచనా ప్రకారం మరో వారం పది రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది.


