Today Rains In TG: తెలంగాణలో నేడు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సిద్దిపేట, కామారెడ్డి, నిజామాబాద్, జనగాం, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి – కొత్తగూడెం, ములుగు, ఖమ్మం, హైదరాబాద్, సిరిసిల్ల, యాదాద్రి, సంగారెడ్డి, రంగారెడ్డి, నల్గొండ అంతటా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే చినుకుల వాతావరణం కొనసాగుతూ ఉందన్నారు. మిగతా ప్రాంతాల్లో కూడా సాయంత్రం నుంచి రాత్రి సమయంలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయన్నారు. నిన్న ఊహించినట్లుగానే, తెలంగాణ అంతటా వివిధ ప్రాంతాల్లో మంచి వర్షపాతం నమోదైందని అన్నారు. నేడు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేశారు. అయితే చాలా ప్రాంతాల్లో మధ్యాహ్నం వరకు పెద్దగా వర్షాలు ఉండవన్నారు. వాతావరణం మాత్రం కొన్ని ప్రాంతాల్లో మేఘావృతమై ఉంటే, మరికొన్ని ప్రాంతాల్లో పొడిగా ఉంటుందన్నారు.
హైదరాబాద్ లో:
నగరంలోని పటాన్‌చెరు, మియాపూర్, లింగంపల్లిలో అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు భారీ వర్షాలు కురిసాయి. నగరంలో ఇప్పటికి ముసురు వాతావరణం నెలకొని ఉంది. ఉదయం నుంచి చినుకులు పడుతూనే ఉన్నాయి. నగరం అంతటా నేడు కూడా తేలికపాటి వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.
గడిచిన 24 గంటల్లో:
కామారెడ్డి, సిద్దిపేట, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి – కొత్తగూడెం, సంగారెడ్డిలోని కొన్ని ప్రాంతాలు, జనగాం, మెదక్, నిజామాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాలు, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి – కొత్తగూడెం, ఆదిలాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. ఇక కరీంనగర్ విషయానికొస్తే వరుణుడు ఆ జిల్లాను పూర్తిగా కప్పేశాడు. నగరమంతా నీటిలో మునిగిపోయి హైదరాబాద్ ను తలపిస్తోంది. ఇంకా వర్షాలు ఎక్కువైతే.. ఆ దగ్గరలోని భూపాలపల్లి, ములుగు లకు అదే గతి పట్టేలా కనిపిస్తోంది. కప్పేస్తుంది. ఇక నిర్మల్, నిజామాబాద్, హన్మకొండ, వరంగల్‌లోని కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత కొన్ని వారాలుగా రాష్ట్రంలో చెప్పుకోదగ్గ వర్షాలు లేవన్న విషయం మీకు తెలిసిందే. వర్షాలు పడాల్సిన సమయంలో మాన్ సూన్ కు బ్రేక్ పడటం కాస్త నిరాశకు గురి చేసిందనే చెప్పాలి. అయితే వాతావరణ శాఖ అధికారులు సూచించినట్లే నేటి మళ్ళీ భారీ వర్షాలు కురుస్తాయని ప్రస్తుత వాతావరణ పరిస్థితులు చూసి చెప్పవచ్చు. రాష్ట్రంలో వర్షపు లోటు కొంతవరకు తీరినా.. ఇంకా తీరాల్సిన అవసరం చాలా ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అభిప్రాయ పడింది.


