భారత్– పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతల ప్రభావం ‘ఆపరేషన్ కగార్’పై (Operation Kagar) పడింది. మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా కర్రెగుట్టల ప్రాంతంలో మోహరించిన సీఆర్పీఎఫ్ బలగాలను దశలవారీగా వెనక్కి పిలిపిస్తున్నారు. ఈ దళాలను తక్షణమే సరిహద్దుల్లోని హెడ్‌క్వార్టర్స్ చేరుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో పామునూరు, ఆలుబాక, పెద్దగుట్ట నుంచి బలగాలు వెనక్కి వస్తున్నాయి. ఆదివారం ఉదయం లోపు సరిహద్దుల్లోకి వెళ్లనున్నాయి. అయితే ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ‘ఆపరేషన్ కగార్’ మాత్రం యథావిధిగా కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు. కాగా ప్రస్తుత బలగాల తరలింపు కేవలం సరిహద్దుల్లో భద్రతను పటిష్టం చేయడం కోసమేనని తెలుస్తోంది. పరిస్థితులు చక్కబడ్డాక తిరిగి కర్రెగుట్టలు చేరుకుంటారని రక్షణ రంగ నిపుణులు తెలిపాయి.