Thursday, September 19, 2024
Homeఆంధ్రప్రదేశ్AP: అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండ

AP: అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండ

రాష్ట్రంలో ఈ మద్య కురుస్తున్న అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులు ఏ మాత్రం ఆందోళన చెందాల్సిన పనిలేదని, పంట నష్టపోయిన రైతులు అందరికీ ప్రభుత్వం అండగా నిలుస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. గురువారం వెలగపూడి ఆంధ్రప్రదేశ్ సచివాలయం నాల్గోబ్లాక్ లోని పబ్లిసిటీ సెల్ లో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ మరియు ఇ.ఓ. కార్యదర్శి హెచ్.అరుణ్ కుమార్, వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ సిహెచ్.హరికిరణ్, పౌర సరఫరాల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీరపాండ్యన్ తో కలసి ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రస్తుతం కురుస్తున్న అకాల వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు.

- Advertisement -

రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో సమావేశమై అకాల వర్షాల వల్ల నష్టపోయే రైతులను పూర్తి స్థాయిలో ఆదుకోవాలని ఇప్పటికే ఆదేశాలను జారీచేయడం జరిగిందని ద్వివేది తెలిపారు. వారి ఆదేశాల మేరకు పంట నష్టపోయిన రైతులను అందరినీ పూర్తి స్థాయిలో ఆదుకోవడం జరుగుతుందని, ఏఒక్కరూ ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న వాతావరణ పరిస్థితులు మరియు ఐ.ఎం.డి. సూచనల మేరకు ఈ అకాల వర్షాలు ఈ నెల 8 వ తేదీ వరకు పడే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఈ వర్షాలు ఆగిన తరువాత పంట నష్టం అంచనా ప్రక్రియను ప్రారంభించడం జరుగుతుందన్నారు. పంట నష్టపోయిన రైతులు ఏ ఒక్కరిని వదలకుండా వారం రోజల్లో సర్వే పూర్తి చేసి పంట నష్టపోయిన వారి జాబితాను ఆర్.బి.కే.ల్లో ఒక వారం రోజుల పాటు సోషల్ ఆడిట్ కై డిస్ప్లే చేయడం జరుగుతుందన్నారు. మొత్తం మీద పదిహేను రోజుల్లో తుది జాబితాను ప్రభుత్వానికి అందజేస్తామని ఆయన తెలిపారు. స్టాండర్డు ఆపరేషన్ ప్రొసీజర్ ప్రకారం పంట నష్టాన్ని అంచనా వేయడం జరుగుతుందన్నారు. కోయాల్సిన పంట (స్టాండింగ్ క్రాప్) మరియు కోసిన పంట (హార్వెస్టింగ్ క్రాప్) విషయంలో రైతులకు ఎటు వంటి నష్టం జరుగకుండా ఉండేందుకై మరియు నష్టాన్ని తగ్గించేందుకు కృషి విజ్ఞాన కేంద్రం, వ్యవసాయ శాస్త్రవేత్తలు ఇచ్చే సూచనలు, సలహాలను రైతులు తప్పక పాటించాలని ఆయన కోరారు. రైతులు ఎటు వంటి సమస్యలు ఎదుర్కొంటున్నా వెంటనే సమీప రైతు భరోసా కేంద్రాన్ని సంప్రదించాలని లేదా వ్యవసాయ శాఖ టోల్ ప్రీ నెం.155251 కు ఫిర్యాదు చేస్తే కంట్రోల్ రూమ్ నుండి మోనిటర్ చేస్తామని ఆయన తెలిపారు.

రాష్ట్ర వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ హరికిరణ్ మాట్లాడుతూ అకాల వర్షాల నేపథ్యంలో అన్ని జిల్లాల యంత్రాంగాన్ని ఆర్.బి.కె. స్థాయి వరకూ అప్రమత్తం చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం కురుస్తున్న అకాల వర్షాలు ఆగిన వెంటనే సర్వే ప్రక్రియ ప్రారంభిస్తామని, ప్రధానంగా జొన్న, మొక్క జొన్న, వరి తదితర పంటలకు నష్టం వాటిల్లిందని ప్రాధమికంగా అంచనా వేయడం జరిగిందని ఆయన తెలిపారు.  సకాలంలో సర్వే ప్రక్రియ పూర్తి చేసి పంట నష్టపోయిన రైతులు అందరికీ  ఖరీఫ్ 2023 సీజన్ ప్రారంభంలోనే  ఈ నష్టపరిహారాన్ని అందజేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. అదే విధంగా మార్చి మాసంలో కురిసిన అకాల వర్షాల వల్ల  మొత్తం 23,473 హెక్టార్లలో వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని, వాటిలో వ్యవసాయ పంటలు  17,820 హెక్టార్లు, ఉధ్యాన వన పంటలు  5,652 హెక్టార్లలో పంట దెబ్బతిన్నట్లు ఆయన తెలిపారు. పంట నష్టపోయిన రైతులకు పెట్టుబడి రాయితీ గా మొత్తం రూ.34.22 కోట్లు వచ్చే ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే రైతుల ఖాతాలో జమచేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.  ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఏ సీజన్ లో పంట నష్టం జరిగితే ఆ సీజన్ ప్రారంభంలోపే పంట నష్టాన్ని అందజేసే పక్రియను అనుసరించడం జరుగుతుందన్నారు.  ఇప్పటి వరకూ  దాదాపు రూ.1,900 కోట్లు మేర పంట నష్ట పరిహారాన్ని రైతుల ఖాతాలో జమచేయడం జరిగిందని ఆయన తెలిపారు. 

తడి ధాన్యాన్ని, రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది…దళారుల మాట నమ్మవద్దు….
ప్రస్తుతం కురుస్తున్న అకాల వర్షాల వల్ల రైతులకు ఎటు వంటి నష్టం వాటిల్లకుండా ఉండేందుకై తడి ధాన్యాన్ని, రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు చేస్తుందని, రైతులు దళారుల మాటలు నమ్మకుండా ఆర్.బి.కె.లకు తమ ధాన్యాన్ని తీసుకురావాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ మరియు ఇ.ఓ. సెక్రటరీ హెచ్.అరుణ్ కుమార్ రైతులకు విజ్ఞప్తి చేశారు. మిల్లర్లు, దళారుల మాటలు విని రైతుల ఏమాత్రం నష్టపోవద్దని రైతులు అందరికీ ఆయన విజ్ఞిప్తి చేశారు. మిల్లర్ల వల్ల రైతులు నష్ట పోకుండా ఉండేందుకై ప్రతీ రైస్ మిల్లులోనూ కస్టోడియన్ ఆఫీసర్ ను నియమించడం జరిగిందన్నారు. రైతులను ఎటు వంటి మోసాలకు గురిచేయకుండా ఖచ్చితంగా మద్దతు ధర ఇచ్చే విధంగా ధాన్యం కొనుగోలు చేయాలని ఫండ్ ట్రాన్సుఫర్ ఆర్డర్ లో మిల్లర్లకు స్పష్టంగా తెలియజేయడం జరిగిందని ఆయన తెలిపారు.

2022-23 ఖరీఫ్ ముగింపు నాటికి 35.41 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 6,40,889 మంది రైతుల నుండి కొనుగోలు చేయడం జరిగిందన్నారు. ఇందుకు గాను మొత్తం రూ.7,233.95 కోట్లు రైతులకు చెల్లిచాల్సి ఉండగా ఇప్పటికే 6,35,194 మంది రైతులకు రూ.7,208.00 కోట్లు అంటే 99 శాతం చెల్లింపులను చేయడం జరిగిందని ఆయన తెలిపారు. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్.పి.సి.ఐ.) తో ఉన్న సమస్య కారణంగా రూ.25 కోట్లు పెండింగ్ లో ఉన్నాయని, ఆ సమస్య కూడా ఈ వారంలోనే పరిష్కారం అవుతుందని ఆయన తెలిపారు. ఈ రబీ సీజన్ కు సంబందించి పంటకొనుగోళ్లు ఏప్రిల్ 1 నుంచి ప్రారంభించడం జరిగిందని, మొత్తం 30 లక్షల మెట్రిక్ టన్నులను మించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన తెలిపారు. 13,031 ఆర్.బి.కే.ల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఇప్పటి వరకూ 5.22 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్నాని 55,576 మంది రైతుల నుండి కొనుగోలు చేయడం జరిగిందన్నారు. ఇందుకు గాను ఇప్పటికే రూ.803.41 కోట్లను అంటే 75 శాతం చెల్లింపులను 43,427 మంది రైతుల ఖాతాలకు జమచేయడం జరిగిందన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన 21 రోజులు లోపే రైతులకు చెల్లింపులు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ధాన్యం రవాణాకై వాహనాలు సమకూర్చుకునేందుకు కార్పస్ ఫండ్ గా జిల్లా కు కోటి రూపాయలు చొప్పున ఐదు జిల్లాల కలెక్టర్లకు నిధులను విడుదల చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం అకాల వర్షాల వల్ల ధాన్యం కొనుగోళ్లకు ఇబ్బందులు ఏర్పడుతున్నట్లు ఆయన తెలిపారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులు ఎటు వంటి సమస్యలను ఎదుర్కొంటున్నా సరే టోల్ ప్రీ నెం.1967 కు ఫిర్యాదు చేస్తే సమస్య పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. రాష్ట్ర పౌర సరఫరాలసంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీరపాండ్యన్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు విషయంలో అన్ని జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడమే కాకుండా క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ రైతుల సమస్యలను పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర స్థాయిలోని కమాండ్ కంట్రోల్ రూమ్ కు దాదాపు 472 పిర్యాదుల అందాయని, వాటన్నింటిని కూడా పరిష్కరించడం జరిగిందని ఆయన తెలిపారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో మిల్లర్లు, సిబ్బంది ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇప్పటి వరకూ 39 మిల్లర్లపై, 25 మంది సిబ్బంది పై చర్యలు తీసుకోవడం జరిగిందని ఆయన తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News