CM YS Jagan: ఏపీ మాజీ సీఎం, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం వైఎస్ఆర్ కడప జిల్లాలో మూడు రోజుల పర్యటనలో భాగంగా కమలాపురం నియోజకవర్గంలో 900 కోట్లతో పలు అభివృద్ధి పనులకు జగన్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం జగన్ మాట్లాడుతూ చంద్రబాబు, పవన్‌పై ఫైర్ అయ్యారు. చంద్రబాబులా ఈ రాష్ట్రం కాకపోతే మరో రాష్ట్రం అని నేను అనను. ఈ పార్టీ కాకపోతే మరో పార్టీ అని కూడా నేను అనడం లేదు. దత్తపుత్రుడిలా ఈ భార్య కాకపోతే మరో భార్య అని అనలేను అంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏపీనే నా రాష్ట్రం.. ఇక్కడే నా రాజకీయం, ఏపీ ప్రజల సంక్షేమమే వైఎస్ఆర్ సీపీ విధానం అని జగన్ అన్నారు. నేను చంద్రబాబులా దత్తపుత్రులను నమ్ముకోలేదని, నా బలం ప్రజలు, నాకు ఆశీస్సులు అందించేది దేవుడు.. వీరే నాకు అండాదండా అంటూ జగన్ అన్నారు. నాయకుడంటే విశ్వసనీయత ఉండాలన్న జగన్.. ఏపీ ప్రజల అభివృద్ధిలో అన్నివిధాల నేను అండగా ఉంటానని అన్నారు. మరో 18నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయని, వైసీపీ ప్రభుత్వం ప్రజల మద్దతుతో మరోసారి అధికారంలోకి వస్తుందని జగన్ దీమా వ్యక్తం చేశారు.
దేవుడి ఆశీస్సులతో అందరికీ మంచి చేస్తున్నామని, ఇక్కడ నియోజకవర్గంలో ప్రారంభోత్సవాలు చేయడం సంతోషంగా ఉందన్నారు. కృష్ణా నది కడపకు వచ్చిందంటే కారణం మహానేత వైఎస్ ఆర్ కారణమన్నారు. మహానేత వైఎస్ ఆర్ కృషితోనే గండికోట ప్రాజెక్టు పూర్తయిందని తెలిపారు. కడప జిల్లాలో ప్రాజెక్టుల కోసం వైఎస్ఆర్ కృషిని కల్లారా ఇప్పుడు చూస్తున్నామని సీఎం జగన్ అన్నారు. జనవరి నెలాఖరులో కడప స్టీల్ ప్లాట్ పనులు ప్రారంభిస్తామని జగన్ స్పష్టం చేశారు.