2022లో మరో 10 రోజుల్లో ముగియనుంది. 2023 కొత్త సంవత్సరానికి గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పేందుకు యావత్ ప్రపంచంతో పాటు భారత్ కూడా సిద్దమవుతోంది. ఇప్పటికే పలు చోట్ల న్యూ ఇయర్ ఈవెంట్లకు అంతా సిద్ధమవుతోంది. రిసార్టులు, పబ్ లు, షాపింగ్ మాల్స్ లో న్యూ ఇయర్ ఈవెంట్లకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నూతన సంవత్సర వేడుకలపై ఏపీ పోలీస్ శాఖ ఆంక్షలు విధించింది. మద్యం తాగి సముద్ర స్నానాలు చేయరాదని హెచ్చరించింది. బీచ్ ల వద్ద ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా, అమ్మాయిలను వేధించినా కఠిన చర్యలు ఉంటాయని తెలిపింది.
అలాగే.. న్యూఇయర్ వేడుకలకై ఏర్పాటు చేసే.. ఈవెంట్లకు రాత్రి 1 గంట వరకు మాత్రమే అనుమతిచ్చింది. ఈ ఈవెంట్స్ నిర్వహణకై ముందుగా పోలీస్ శాఖ నుండి అనుమతి తీసుకోవలసి ఉంటుంది. 1 గంట తర్వాత.. ఎవరూ రోడ్లపై తిరగరాదని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. అలాగే ఎక్కడికక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపేవారికి భారీ జరిమానాలు తప్పవని హెచ్చరించారు.