Harish Rao| తెలంగాణ రాజకీయాలు మూసీ చుట్టూ తిరుగుతున్నాయి. మూసీ ప్రక్షాళన చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తేల్చి చెబుతుండగా.. బాధితులకు అండగా నిలుస్తామని ప్రతిపక్షాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా మూసీ బాధితుల సమస్యలపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సీఎంకు మాజీ మంత్రి హరీశ్ రావు సవాల్ విసిరారు. దీనిపై చర్చించేందుకు ఎక్కడికైనా వచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. భూసేకరణ చట్టం ప్రకారం బాధితులకు పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.
మూసీ బాధితుల పక్షాన కోర్టుకు వెళ్తామని.. పార్లమెంట్‌లో ప్రివిలేజ్ మోషన్ ఇస్తామని పేర్కొన్నారు. మూసీ గురించి చర్చకు సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడికి రమ్మంటారో చెప్పండి.. వస్తానని సవాల్ విసిరారు. సచివాలయం రమ్మన్నా వస్తానని.. అఖిలపక్ష సమావేశం పెట్టినా సిద్ధమని చెప్పారు. ప్రతిపక్షంగా తాము ప్రశ్నిస్తుంటే బుల్డోజర్ ఎక్కిస్తాం.. సంపేస్తాం.. తొక్కుతాం అంటూ మాట్లాడుతున్నారంటూ కాంగ్రెస్ నాయకులపై హరీశ్ రావు మండిపడ్డారు.