భద్రకాళి చెరువును కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టిన వారిపై త్వరలోనే చర్యలు తీసుకుంటామని రాష్ట్ర సమాచార, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు.
వరంగల్ హంటర్ రోడ్డు లోని భద్రఖాళీ బండ్ ని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, వర్దన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు, ఎమ్మెల్సి బస్వారాజు సారయ్య, మేయర్ గుండు సుధారాణి, వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్ లు ప్రావీణ్య, సత్య శారదా లతో కలిసి పరిశీలించారు. బండ్ ఆవరణలో కలియ తిరిగిన మంత్రి , ఇరిగేషన్, కుడా అధికారులతో చెరువు పూర్తి విస్తీర్ణం, చేయాల్సిన పనులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం శ్రీ భద్రకాళీ అమ్మవారిని దర్శించికుని, మాడ వీధుల పనుల పురోగతిని పరిశీలించారు. ఆలయ అర్చకులు మంత్రికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ… వరంగల్ నగరాన్ని రాష్ట్ర రెండో రాజధానిగా అభివృద్ధి చేసేటందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నామని తెలిపారు. దశాబ్దాల కాలంగా కలగా ఉన్నటువంటి మామునూరు ఎయిర్ పోర్ట్ కు అవాంతరాలు తొలగిపోయాయని, కేంద్రం అనుమతి ఇస్తే త్వరలోనే ఎయిర్ పోర్ట్ నిర్మాణం చేపట్టి అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని, మాడ వీధులను త్వరితగతిన పూర్తి చేసేటందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
భద్రకాళి జలాశయమును తాగు నీటి జలాశయముగా మారుస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పీసీసీ సభ్యులు ఇవి శ్రీనివాస్ రావు, ఎంపీ ఆనంద్,కార్పొరేటర్లు మామిండ్ల రాజు, పోతుల శ్రీమాన్,ప్రజా ప్రతినిధులు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.