తెలుగు సాహిత్య రంగంలో జాతీయ స్థాయిలో ఖ్యాతి తెచ్చిన మల్లినాథ సూరి ఇక్కడి వారు కావడం జిల్లా ప్రజలు గర్వించదగ్గ విషయమని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్య కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి అన్నారు.. ఆయన స్వస్థలం కొల్చారంలో కోలాచల మల్లినాథసూరి పేర సంస్కృత విశ్వ విద్యాలయం ఏర్పాటుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాచరణకు ఆదేశించడంపట్ల సంతోషం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ రాజర్షి షా, నర్సాపూర్ శాసనసభ్యులు మదన్ రెడ్డి, అదనపు కలెక్టర్ రమేష్, కౌన్సిల్ వైస్ చైర్మన్ వెంకటరమణ, మహారాష్ట్ర లోని రామ్టె టెక్ సాంస్కృతిక విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మధుసూదన్, ఉస్మానియా విశ్వవిద్యాలయం సాంస్కృతిక అకాడమీ డైరెక్టర్ ప్రొఫెసర్ నీలకంఠం, కాలేజీ ఎడ్యుకేషన్ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు డా. యాదగిరి లతో కలిసి విశ్వవిద్యాలయం కోసం అధికారులు గుర్తించిన 30 ఎకరాల స్థలం ప్రాంతాన్ని, మరోచోట గుర్తించిన 27 ఎకరాల స్థలాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ సాహిత్య రంగంలో మెదక్ జిల్లాకు వన్నె తెచ్చిన మల్లినాథసూరి స్వస్థలమైన కొల్చారంలో సంస్కృత విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయుటకు కార్యాచరణ చేపట్టవలసినదిగా రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యా శాఖను ఆదేశించారని గుర్తు చేశారు. విద్యా శాఖామంత్రి సూచనల మేరకు కొల్చారంలో సంస్కృత విశ్వవిద్యాలయం ఏర్పాటుకు రెండు ప్రాంతాలలో స్థలాలను పరిశీలించామని, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, నర్సాపూర్ శాసనసభ్యులు కూడా స్థలాలపై పూర్తి సమాచారమిచ్చారని అన్నారు. అట్టి స్థలాలు రోడ్డుకు సమీపంలో ఉండడం, బోరు పడే అవకాశాలున్నాయని గుర్తించామన్నారు. మౌలిక సౌకర్యాలతో సంస్కృత విశ్వవిద్యాలయం ఏర్పాటుకు స్థలం ఎంపికకై సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తామని లింబాద్రి అన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రంధాలయ సంస్థ చైర్మన్ చంద్ర గౌడ్, ఆత్మ కమిటీ చైర్మన్ వెంకట్ రెడ్డి, ఆర్డీ.ఓ. సాయి రామ్, తహశీల్ధార్ చంద్రశేఖర్, ఏం.పి .డి.ఓ. జెడ్పిటిసి, ఎంపిపి, సర్పంచు తదితరులు పాల్గొన్నారు.