Saturday, May 11, 2024
Homeఫీచర్స్Millet Didis: వీళ్లిద్దరూ 'మిల్లెట్ దీదీ'లు

Millet Didis: వీళ్లిద్దరూ ‘మిల్లెట్ దీదీ’లు

చిరు ధాన్య విప్లవ సారథులు ఈ మహిళా రైతులు

  ఇక్కడ కనిపిస్తున్న ఇద్దరు మహిళలూ ‘మిల్లెట్ దీదీ’లుగా సుప్రసిద్ధులు. వీళ్లు ఒడిషాకు చెందిన ఆదివాసీ స్త్రీలు. ఒకరు సుబాసా మొహంతా. ఇంకొకరు రైమతి ఘియురియా.  సాధారణ గిరిజన మహిళా రైతులైన వీరిద్దరూ ఢిల్లీలో జరుగుతున్న జి20 సదస్సుకు ‘ఒడిషా మిల్లెట్ మిషన్’ ప్రతినిధులుగా హాజరయ్యారు. సేంద్రియ వంగడాలపై వీళ్లు ప్రపంచ ప్రతినిధులకు వివరించే అపురూపమైన అవకాశం దక్కించుకున్నారు. చిరుధాన్యాల సాగులో,  సంప్రదాయ పంటల్లో విశేషానుభవం వీళ్లిద్దరి సొంతం. తమ కమ్యూనిటీకి అండగా నిలబడడమే కాకుండా వారికి జీవనోపాధి అవకాశాలను కల్పించిన మహిళ రైమతి ఘియురియా. ఈ ఇధ్దరు మిల్లెట్ మహిళల గురించిన విశేషాలే ఈ కథనం…  

- Advertisement -

  ఆదివాసీ మహిళ అయిన సుబాసా మొహంతా ఊరు ఒడిశాలోని మయూర్ భంజ్ . మాండియా దీదీ (మిల్లెట్ దీదీ)గా స్థానికులకు సుబాసా పరిచితురాలు. ఇంకొకరు ఒడిషాకే చెందిన గిరిజన మహిళ రైమతి ఘియురియా. ఈమె తన గ్రామం కోరాపుట్ లోని ఎందరో గిరిజన మహిళలను విజయవంతంగా మిల్లెట్ సాగులోకి దించిన వ్యక్తి. ఆ కృషి ఫలితంగానే ప్రస్తుతం అక్కడ 35  కుటుంబాలకు చెందిన స్త్రీలు చిరుధాన్యాల పంటలు పండిస్తున్నారు. ఈ ఇద్దరు గిరిజన మహిళలు సాధించిన విజయాలు, ప్రత్యేకతలు ఎన్నో ఉన్నాయి. సుబాసా మొహంతాకు నలభై ఐదు ఏళ్లు. ఆమెకు మిల్లెట్ సాగులో విశేష అనుభవం ఉంది. అందులోని తన విస్తృత అనుభవాలను ప్రతిష్టాకరమైన జి20 సదస్సులో పాలుపంచుకునే అపురూపమైన అవకాశం సుబాసాకు వచ్చింది.  2018 నుంచి సుబాసా చిరుధాన్యాల సాగు చేస్తోంది.  చిరుధాన్యాల గురించి సుబాసాకు పరిచయం చేసింది ఆమె మేనల్లుడు. అతను ఇచ్చిన 250 గ్రాముల చిరుధాన్యాల గింజలతో సుబాసా మిల్లెట్ సాగును షురూ చేసింది. 

సుబాసా మొదట్లో కీరకాయలు, గుమ్మడికాయలు, ఇతర కూరగాయలను పండించేది. కానీ వాటి ద్వారా ఆమెకు మంచి లాభాలు వచ్చేవి కావు. కుటుంబం గడవడం కష్టంగా ఉండేది.  ఎప్పుడైతే చిరుధాన్యాల సాగును సుబాసా మొదలెట్టిందో అప్పటి నుంచి ఆమె ఆర్థిక పరిస్థితులు బాగా మెరుగుపడ్డాయి. ప్రస్తుతం సుబాసా నాలుగు ఎకరాల్లో చిరుధాన్యాల సాగును చేస్తోంది. ఆ భూమి యజమానులకు ప్రతి ఏడాదీ కట్టే లీజ్ మొత్తం పోనూ చిరుధాన్యాల పంటల మీద మంచి ధర, లాభాలు సుబాసా చేతికి రావడం మొదలైంది. చిరుధాన్యాలపై జరిగిన గ్లోబల్ సదస్సులో సుబాసా ప్రధాని నరేంద్ర మోదీని కలవడమే కాదు వ్యవసాయంలో తన అనుభవాలను ఆయనతో పంచుకుంది కూడా. అంతేకాదు దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కూడా సుబాసా కలిసింది. ఒడిషా ప్రభుత్వ మిల్లెట్ మిషన్ ప్రారంభించినప్పటి నుంచి ఎన్నో అద్భుత పరిణామాలు తమ దగ్గర చోటుచేసుకున్నాయని ఘుయిరియా, సుబాసాలు అంటారు. ఒడిషా రాష్ట్రం మొదలెట్టిన మిల్లెట్ మిషన్ 30 జిల్లాల్లోని మొత్తం 177 బ్లాకులకు చేరింది. చిరుధాన్యాల్లో చాలా రకాలు ఉన్నాయని, ఇవన్నీ రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పంచుతాయని ఘియురియా, సుబాసాలు అంటారు.     చిరుధాన్యాల సాగు ఘియురియా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఫార్మర్స్ ప్రోడ్యూస్ అనే కంపెనీని ఘియూరియా ముందుండి నడిపించింది. ఇది స్థానిక రైతుల నుంచి చిరుధాన్యాలను సేకరిస్తుంది. తన బ్లాకులో మిల్లెట్ టిఫిన్ సెంటర్ నిర్వహిస్తున్న ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ వారికి ఘియూరియా అండగా నిలబడింది. ‘మా చిరుధాన్యాలను ప్రస్తుతం మండీలలో అమ్ముతున్నామ’ని ఘియురియా ఎంతో సంతోషాన్ని వ్యక్తంచేస్తోంది.

అలాగే ‘జి 20 సదస్సుకు హాజరవడం నాకెంతో ఆనందంగా ఉంది. ఎన్నో దేశాల నుంచి ఎందరో ప్రముఖులు ఈ సదస్సుకు హాజరవుతున్నారు. వారందరికీ రాగుల రకాలను చూబించడంతో పాటు వాటిని ఎలా సాగు చేస్తారో వివరిస్తాను’ అని ఎంతో ఉత్సాహంగా ఘియురియా చెప్పింది.  చిరుధాన్యాల సాగులో మిల్లెట్ మిషన్ ద్వారా ఒడిషా రాష్ట్రం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఘానాన్ని ఉపయోగిస్తూ అధిక దిగుబడిని సాధిస్తోందని ఘియూరియా అంటుంది.  అత్యాధునిక సాంకేతిక పరిజ్ఘానంతో పాటు శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులను ఉపయోగించడం ద్వారా చిరుధాన్యాల ఉత్పత్తిని అధికం చేయగలమనేదానికి తమ జిల్లా నిదర్శనమని ఘియురియా చెప్తుంది. ఈ పద్ధతులను అనుసరించడం ద్వారా చిరుధాన్యాల దిగుబడితో పాటు నాణ్యమైన చిరుధాన్యాల ఉత్పత్తిని సైతం సాధించగలమని ఘియురియా అభిప్రాయపడింది.

అత్యున్నత టెక్నాలజీ, సైంటిఫిక్ ఫార్మింగ్ పద్ధతుల ప్రయోజనాల గురించి తన అనుభవాలను జి20 సదస్సులో పంచుకునున్నట్టు కూడా ఘియూరియా చెప్పింది.   సంప్రదాయ పంటల పునరుద్ధరణలో కూడా ఘియురియా  పాత్ర ఎందరినో ఉత్తేజితులను చేస్తుంది. ఇలా పునరుద్ధరించిన వాటిలో సంప్రదాయ ధాన్యంతో పాటు చిరుధాన్యాలు కూడా ఉన్నాయి. ఈ పంటల్లో ఎంతో విశేషానుభవం ఉన్న ఆమె తన కమ్యూనిటీలో ఎంతోమంది మహిళలకు స్ఫూర్తిగా నిలబడడం విశేషం. వ్యవసాయం పట్ల ఆమెకున్న అంకిత భావం ఘియురియాను రిసోర్సు పర్సన్ గా చేసింది. చిరుధాన్యాల పంటలకు సంబంధించి ఇప్పటివరకూ 2,500 మంది రైతులకు ఘియూరియా శిక్షణ ఇచ్చింది. దాంతోపాటు లైన్ ట్రాన్స్ ప్లాంటింగ్, ఇంటర్ క్రాపింగ్, ఆర్గానిక్ పెస్ట్ మేనేజ్మెంట్ వంటి వాటిల్లో సైతం రైతులకు ట్రైనింగ్ ను ఘియురియా అందిస్తోంది. అంతేకాదు 72 రకాల దేశీయ ధాన్యం వెరైటీలను, అలాగే 30 పైగా చిరుధాన్యాల వెరైటీలను భద్రం చేసింది. 

  ఇవన్నీ ఒక ఎత్తయితే వ్యవసాయం పరంగా ఘియురియా అందించిన సేవలపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఘియూరియాకు ఎన్నో ప్రశంసాపత్రాలు, అవార్డులు వచ్చాయి. 2012లో ఆమెకు జెనోమ్ సేవియర్ కమ్యూనిటీ అవార్డు వచ్చింది. 2015లో జెమ్సెట్ జీ టాటా నేషనల్ వర్చువల్ అకాడమీ ఫెలోషిప్ అవార్డు కూడా వచ్చింది. వీటితో పాటు 2015, 2017,2018 సంవత్సరాలలో బెస్ట్ ఫార్మర్ అవార్డును కూడా టాటా స్టీల్ వారి నుంచి ఘియురియా  అందుకుంది. ఇవి కాక మరెన్నో రివార్డులు సైతం ఘియురియాకు వచ్చాయి. ‘ప్రస్తుతం మిల్లెట్ వాల్యూ ఎడిషన్, ప్రోసెసింగ్ యాక్టివిటీలపై దృష్టి నిలిపినట్టు 36 సంవత్సరాల రైమతి ఘియురియా అంటోంది.  ఘియురియా భూమియా కమ్యూనిటీకి చెందింది. కస్టోడియన్ రైతుగా ఆమె సాధించిన విజయాలు ఎందరినో ఆశ్చర్యపరిచాయి. అంతేకాదు కమ్యూనిటీ రిసోర్సు పర్సన్ గా, ట్రైనర్ గా కూడా పలువురి ప్రశంసలను ఘియురియా పొందింది. కోరాపుట్ లో ఆమె ప్రారంభించిన మిల్లెట్ ఫార్మింగ్ మిషన్ విజయాల గురించి సదస్సులో మాట్లాడనుంది. ఆర్గానిక్ వ్యవసాయంలో ఘియురియా అనుభవం అపారమైంది.  

  సేంద్రియ వ్యవసాయం ప్రాధాన్యతతో పాటు వాటి వివిధ పద్ధతులను కూడా రైతులకు ఘియురియా నేర్పుతుంది.  రైతులకు ఆమె అందించే శిక్షణలో సీడ్ మల్టిప్లికేషన్ ఇండెక్స్ (ఎస్ ఎం ఐ), రాగుల సాగుకు ఎల్ టి (లైన్ ట్రాన్స్ ప్లాంటింగ్) పద్ధతుల వంటివి కూడా ఉన్నాయి.  ఘియురియాలో దాగున్న ప్రతిభను గుర్తించిన ఒడిషా లైవ్లీహుడ్ మిషన్ (ఒఎల్ఎం) ఆమెను ఎక్స్ టర్నల్ లైవ్లీహుడ్ సపోర్టు పర్సన్ (ఇఎల్ఎస్ పి) గా ఇతర బ్లాకులకు రిసోర్సు పర్సన్ గా పంపుతోంది. ఘియూరియా భర్త కూడా రైతే. అతను భార్య ఘియురియాకు ఎంతో సహాయసహకారాలను అందిస్తున్నాడు. ఘియురియా తన గ్రామంలో ‘బామండి ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్’ ను నిర్వహిస్తోంది. ఈ కంపెనీ బయో ఫెర్టిలైజర్స్, బయోఫెస్టిసైడ్స్ ఉత్పత్తి, అమ్మకాలు చేస్తుంది. అంతేకాదు చిరుధాన్యాలకు సంబంధించిన ఉత్పత్తులు, చిరుధాన్యాల సేకరణ, మార్కెటింగ్, వాల్యూ ఎడిషన్ వంటి కార్యకలాపాలను కూడా నిర్వహిస్తుంది. అంతేకాదు తమ గ్రామంలో ఒక ఫార్మింగ్ పాఠశాలను ఏర్పాటుచేయడంలో కూడా ఘియురియా కీలక పాత్ర పోషించింది. ఇందుకోసం ఆమె తన కుటుంబం స్థలాన్ని ఇచ్చింది. 2012 నుంచి ఆ ఫాఠశాల  విజయవంతంగా నడుస్తోంది.

    జి20 గ్లోబల్ వేదికపై అందరికీ చిరుధాన్యాలను పరిచయం చేసింది.  కోరాపూట్ గిరిజనులు చేసే చిరుధాన్యాల సాగు, వాటి భద్రత పరంగా అనుసరించే పద్ధతులను కూడా ఈ సదస్సులో సభికులతో పంచుకుంది. సుబాసా మెహతా, రైమతి ఘియురియాలు మిల్లెట్ బ్రాండ్ అంబాసిడర్లుగా జి20 సదస్సులో పాల్గొన్నారు. చిరుధాన్యాల ప్రయోజనాలు, వాటిల్లో ఉండే పోషకాల గురించి సదస్సుకు హాజరైన ప్రతినిధులకు తెలియజేయనున్నారు. అంతేకాదు వీరిద్దరు ఆదివాసీల జీవనశైలి గురించి, వాళ్లు పడుతున్న కష్టాల గురించి, వాళ్లు చిరుధాన్యాలు భద్రపరుచుకునే తీరు తెన్నుల వంటి ఎన్నో విషయాల గురించి పాలుపంచుకున్నారు. కుంద్ర ఏరియాలో మిల్లెట్ మిషన్ నాయకురాలిగా కూడా ఘియురియా వ్యవహరిస్తోంది.  

    తన గ్రామం చుట్టుపట్ల దారిద్రరేఖకు దిగువన బతుకుతున్న ఎందరో నిరుపేదలు, గిరిజన కుటుంబాలకు సురక్షితమైన, శుభ్రమైన తాగునీరు అందించాలన్నది ఘియురియా లక్ష్యం. అంతేకాదు వర్షపు నీరును ఇళ్లల్లో, పశువుల కోసం భద్రం చేయాలని కూడా భావిస్తోంది.  చిరుధాన్యాలను నూతన తరాలకు అందించాలన్నది ఘియురియా చిరకాల వాంఛ, అభిలాష. వర్షాలు బాగా కురిసేలా గ్రీన్ ఫారెస్టు కవరు వృద్ధి, కొండలపై గడ్డి పెంపకం వంటి వాటిపై కూడా ఘియురియా దృష్టిపెట్టింది. సుబాసా మెహతా, ఘియురియా ఇద్దరూ ట్రైబల్ మిల్లెట్ ఫార్మింగ్ పద్ధతుల గురించి అందరిలో అవగాహన పెంచేందుకు చేస్తున్న కృషి అమోఘం.  చిరుధాన్యాలపై అవగాహనా చైతన్యాన్ని ప్రజలలో తీసుకురావడంలో ఈ ఇద్దరు ఆదివాసీ మహిళలు ఎందరికో ఎంత స్ఫూర్తివంతంగా నిలుస్తున్నారో వేరే చెప్పాలా…

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News