బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కరీంనగర్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు సవాల్ విసిరారు. కరీంనగర్ పార్లమెంటులో దమ్ముంటే రెండో స్థానంలో నిలిచి చూపించాలని అన్నారు. బీఆర్‌ఎస్‌ది మూడో స్థానమేనని జోస్యం చెప్పారు. బీజేపీతో కాంగ్రెస్ కుమ్మయ్యిందని, అందుకే డమ్మీ అభ్యర్థులను పెట్టిందని కేటీఆర్ సిరిసిల్ల సభలో అనడంపై వెలిచాల మండిపడ్డారు. బీజేపీతో బీఆర్‌ఎస్ పార్టీయే కుమ్మక్కయిందని అందుకు కేసీఆర్ చేసిన వ్యాఖ్యలే రుజువని రాజేందర్ రావు గుర్తు చేశారు. మీ అయ్య కేసీఆర్‌ను అడిగితే నేను ఎవరో తెలుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేటీఆర్ అమెరికాలో ఉండి తెలంగాణపై కండ్లు తెరువనప్పుడే కేకే మహేందర్‌రెడ్డి, తాను ఉద్యమంలో కీలకంగా పని చేశామని అన్నారు. మేము తెలంగాణ ఉద్యమానికి, నీ పార్టీకి చేసిన సేవలేంటో మీ తండ్రికి తెలుసన్నారు రాజేందర్ రావు. నమ్మిచ్చి మోసం చేయడంలో, అబద్దాలు చెప్పడంలో మీకు ఎవరూ సాటి రారని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బండకేసి కొట్టినా అహంకారం తగ్గలేదని అన్నారు. ఈ ఎన్నికల్లో మీ పార్టీని నీ అహంకారాన్ని ప్రజలు పాతాలానికి తొక్కుడు ఖాయం అన్నారు. అభ్యర్థులకు బీఫామ్స్ ఇచ్చి మోసం చేసిన చరిత్ర మీ అయ్యదని విమర్శించారు. కేకే మహేందర్ రెడ్డి 2009లో పోటీ చేసినప్పుడు సిరిసిల్ల బస్టాండ్‌కి కేటీఆర్ వస్తే గుర్తించే నాథుడే లేరని ఎద్దేవా చేశారు.
బీఆర్‌ఎస్ కండువా వేసుకుని బీజేపీ కోసం పని చేశారని వెలిచాల రాజేందర్ రావు దుయ్యబట్టారు. ఎవరు ఎవరితో కుమ్మక్కయినా కరీంనగర్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భారీ మెజార్టీతో గెలువబోతున్నామని ఆయన స్పష్టం చెప్పారు. బీఆర్‌ఎస్‌కు రెండో స్థానం కూడా రాదన్నారు. బీఆర్‌ఎస్ మూడో స్థానంలో నిలిస్తే కేటీఆర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, పార్టీని రద్దు చేసుకుంటారా అని సవాల్ చేశారు. కేటీఆర్ అంటే కల్వకుంట్ల థర్డ్‌క్లాస్ రామారావు అంటూ మండిపడ్డారు.