తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(Jagadish Reddy) బడ్జెట్ సమావేశాలు అయిపోయే వరకు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అయినా కానీ ఆయన ఇవాళ అసెంబ్లీకి వచ్చారు. దీంతో మార్షల్స్ సభలోకి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. వారితో వాగ్వాదానికి దిగిన జగదీష్ రెడ్డి.. తనను వద్దని స్పీకర్ ఇచ్చిన బులిటెన్ చూపించాలని డిమాండ్ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యాంగ విలువలు, నిబంధనలు లేకుండా అసెంబ్లీ(Telangana Assembly) ఇష్టారాజ్యంగా నడుస్తోందని ఆరోపించారు.
‘నన్ను సస్పెండ్ చేశారో లేదో ఇప్పటికీ ఆధారాలు లేవు. మందబలంతో సభ నడుపుతాం అంటే కుదరదు. ముందు నా సస్పెన్షన్‌పై బులిటెన్ ఇవ్వాలి.. లేదంటే స్పీకర్‌నే నేరుగా కలుస్తాను. బులిటెన్ ఇస్తే నేను కోర్టుకు వెళతా అనే భయంతోనే.. ఇవ్వడం లేదు. సస్పెండ్ చేసిన వెంటనే బులిటెన్ ఇవ్వాలి.. కానీ వారం గడిచినా ఇంకా ఇవ్వడం లేదు.. ఎందుకు సస్పెండ్ చేశారో ఆధారాలు లేకనే బులిటెన్ ఇవ్వడం లేదు. గంట ప్రయాణానికి కూడా మా నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రులు హెలికాప్టర్‌లో వెళ్తున్నారు. ఆదివారం జాన్ పహడ్‌లో జానారెడ్డి దావత్‌కు కూడా హెలికాప్టర్‌లో వచ్చారు’ అంటూ విమర్శించారు.