Thursday, May 9, 2024
Homeఫీచర్స్Indian Railways headed by this Lady boss: రైల్వేస్ వి‘జయ’ సారథి

Indian Railways headed by this Lady boss: రైల్వేస్ వి‘జయ’ సారథి

వేగంతో, భద్రతకు ఇండియన్ రైల్వేస్ చిరునామా

ఈ ఫోటోలో కనిపిస్తున్న మహిళ పేరు జయావర్మ సిన్హా.  రైల్వేస్ సీనియర్ ట్రాఫిక్ సర్వీస్ ఆఫీసర్ గా సేవలు అందించిన ఆమె ఇటీవల ఇండియన్ రైల్వేస్ తొలి మహిళా చీఫ్ ఎగ్జిక్యూటివ్, రైల్వే బోర్డు ఛైర్ పర్సన్ గా బాధ్యతలు స్వీకరించి సరికొత్త చరిత్ర సృష్టించారు. 166 సంవత్సరాల రైల్వేబోర్డు చరిత్రలో ఒక మహిళ ఈ అత్యున్నత పదవీ బాధ్యతలు చేపట్టింది. ఆమె గురించిన విశేషాలే ఈ కథనం..

- Advertisement -

జయ వర్మ సిన్హా ఇండియన్ రైల్వేస్ మేనేజ్మెంట్ సర్వీస్(ఐఆర్ ఎంఎస్)కి చెందినవారు. ఆపరేషన్స్ అండ్ బిజినెస్ డెవలెప్మెంట్ సభ్యురాలు. ఆమెను కేంద్ర ప్రభుత్వం రైల్వే బోర్డు ఛైర్మన్ గా, రైల్వేస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా నియమించింది. ఇండియన్ రైల్వేస్ కు చెందిన టాప్ డెసిషన్ మేకింగ్ బాడీ ఈ రైల్వే బోర్డు.  జయ వర్మ 1988లో ఇండియన్ రైల్వేస్ ట్రాఫిక్ సర్వీసు (ఐఆర్ టిఎస్)లో చేరారు. రైల్వేస్ లో ట్రాఫిక్ ట్రాన్స్‌పోర్టేషన్ అడిషనల్ మెంబర్ వంటి ఎన్నో ముఖ్యమైన పొజిషన్లను కూడా జయ నిర్వహించారు. అంతేకాదు రైల్వేస్ కు సంబంధించిన పలు విభాగాలకు సంబంధించిన అడ్మినిస్ట్రేషన్, మేనేజ్మెంట్ రంగాలలో అపార అనుభవం ఉన్న వ్యక్తి ఆమె. ప్రస్తుతం జయా వర్మ చేబట్టిన కొత్త బాధ్యతల్లో భాగంగా రైల్వేస్ ఫ్రైట్, ప్రజల ట్రాన్స్పోర్టేషన్ సేవల బాధ్యతలు కూడా ఆమె భుజంపైనే ఉన్నాయి. జయావర్మ ఈ సరికొత్త నియామకంతో రైల్వేస్ లో మహిళల నూతన శకం ప్రారంభమైంది.

సివిల్ సర్వీస్ పరీక్షల్లో మంచి ర్యాంకు వచ్చినా కూడా జయా వర్మ ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీసునే ఎంచుకుంది. ఆమె చేరినప్పుడు అంటే 1988ల్లో ఇది పూర్తిగా పురుషాధిక్యతతో కూడి ఉండేది. ఆ సమయంలో ఇందులో మహిళలు అస్సలు ఉండేవారు కాదు. సరిగ్గా ఆ సమయంలోనే ట్రైనింగ్ పూర్తిచేసుకున్న జయావర్మకు డివిజనల్ కమర్షియల్ ఆఫీసర్ గా ఉత్తర రైల్వేస్ కు చెందిన అలహాబాద్ డివిజన్ లో పోస్టింగ్ వేశారు. కోల్ కతా నుంచి ఢాకాకు చారిత్రాత్మకమైన మైత్రి ఎక్స్ ప్రెస్ ప్రారంభమైన సమయంలో ఢాకాలోని భారత హైకమిషన్ లో రైల్వేస్ సలహాదారుగా జయ విధులు నిర్వహిస్తున్నారు.  రైల్వేస్ ను ఆధునీకరిస్తున్న సమయంలో సిఇవొగా బాధ్యతలు చేపట్టిన జయ అందుకు తగ్గట్టే రైల్వేస్ ను ఫాస్ట్ గా ట్రాక్ పైకి తీసుకురావడంలోనూ సఫలులయ్యారు. భద్రతకు ఆమె పెద్ద పీట వేశారు. అందులోనూ రైల్వేస్ ప్రతికూలపవనాలను ఎదుర్కొంటున్న సమయంలో ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద రైల్ ట్రాన్స్ పోర్టర్ అయిన భారత రైల్వేస్ కు జయా వర్మ సిన్హా సిఇవొగా, రైల్వేస్ బోర్డు ఛైర్ పర్సన్ గా బాధ్యతలు చేపట్టడం ఒక ముఖ్య పరిణామమని చెప్పాలి. ఇండియన్ రైల్వేస్ బోర్డు యాక్ట్ 1905 కింద రైల్వే బోర్డు ఏర్పడింది.

  ఒరిస్సాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం సమయంలో జయ పలు మార్లు మీడియాతో మాట్లాడడం జరిగింది. ఆ దుర్ఘటనలో అధికారిక లెక్కల ప్రకారం 300 మంది చనిపోయారు. 1200 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ దుర్ఘటనా సమయంలోనే జయ వర్మ గురించి నలుగురికీ బాగా తెలిసింది. మూడు దశాబ్దాల పైగా తన కెరీర్ లో పలు విభాగాలలో జయ పనిచేశారు. వాటిల్లో ఆపరేషన్స్, కమర్షియల్, ఐటి, విజిలెన్స్ వంటివి సైతం ఉన్నాయి. ఐటి సంబంధిత పటుత్వమైన వ్యవస్థను ఏర్పరచేందుకు గాను సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (సిఆర్ఐఎస్) బాడీ స్థాపనకు జయవర్మ పూనుకున్నారు. ఆ పనిలో ఎంతో కీలకంగా వ్యవహరించారు. అంతేకాదు ఫ్రైట్ ఆపరేషన్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ను అభివృద్ధి చేయడంలో సైతం జయ చేబట్టిన పాత్రను మరవలేం. ఆగ్నేయ రైల్వేస్ కు ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ గా నియమితులైన తొలి మహిళ జయా వర్మ సిన్హానే. పెద్ద పెద్ద ప్రాజక్టులతో రైల్వేస్ ఆధునీకరణ వేగవంతం చేస్తున్న సమయంలో…అందులోనూ కొత్త రైల్వే లైన్ల నిర్మాణం, స్టేషన్ డెవలెప్మెంట్, ప్రత్యేకమైన ఫ్రైట్ కేరిడార్స్, వందేభారత్ ట్రైన్స్ , దేశ తొలి బుల్లెట్ ట్రెయిన్ కారిడార్ వంటివి జరుగుతున్న టైములో ఈ పదవిలోకి జయా వర్మ వచ్చారు. 

  ఈ ప్రాజక్టులన్నీ నిర్దేశిత సమయంలో పూర్తయ్యేలా జయా వర్మ నడుంకట్టారు. రైల్వేస్ భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ తన బాధ్యతలను విజయవంతంగా కొనసాగిస్తున్నారు. రైల్వే రంగం అభివృద్ధిలో జయ నిర్వహించిన విశేష కృషి వల్లే నేడు రైల్వేస్ లోని అత్యున్నత పదవిని పొందగలిగారని ఆమె పనితీరు ఎరిగిన ఎందరో అంటారు.  అలహాబాద్ విశ్వవిద్యాలయంలో జయా వర్మ చదివారు. ఆ తర్వాత ఇండియన్ రైల్వేస్ ట్రాఫిక్ సర్వీసులో చేరి ఉత్తర రైల్వేస్, ఆగ్నేయ రైల్వేస్, ఈస్ట్రన్ రైల్వేస్ లో కూడా జయ విధులు నిర్వహించారు. జయా వర్మ సిన్హాకు ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. రైల్వేస్ అత్యున్నత పదవిలో ఆమెను నియమించడం ఆమె ప్రతిభకు, పనితీరుకు, సమర్థతకు నిదర్శనంగా పలువురు చెప్తారు. అంతేకాదు ఇండియన్ రైల్వేస్ లో జెండర్ డైవర్సిటీకి, లీడర్ షిప్ రోల్స్ లో కనిపించే ఇంక్లూజివిటీకి గుర్తింపుగా కూడా జయ వర్మ  విజయాన్ని చాలామంది చూస్తున్నారు.  ఇండియన్ రైల్వేస్ తో జయ అనుబంధం 35 సంవత్సరాలుగా కొనసాగుతోంది. సీల్దా డివిజన్ కు డివిజనల్ రైల్వే మేనేజర్ గా కూడా ఆమె పనిచేశారు. ఢాకాలోని ఇండియన్ హైకమిషన్ లో నాలుగు సంవత్సరాలపాటు రైల్వే సలహాదారుగా కూడా జయకు విశేషానుభవం ఉంది. బాలాసోర్ దుర్ఘటన సమయంలో జయా వర్మ ఆపరేషన్ అండ్ బిజినెస్ డెవలెప్మెంట్ సభ్యురాలిగా ఉన్నారు. అప్పుడే సంక్లిష్టమైన సిగ్నిలింగ్ సిస్టమ్ గురించిన పలు విశేషాలు మీడియాకు వివరించి వార్తల్లోకెక్కారు.

సెప్టెంబరు 1, 2023 నుంచి రైల్వే బోర్డు ఛైర్మన్ గా, రైల్వేస్ సిఇవొగా జయా వర్మ తన విధులను చేపట్టారు. ఢిల్లీలో 1963, సెప్టెంబరు 18న జయ జన్మించారు. సంవత్సరానికి 50 లక్షలు ఆమె సంపాదిస్తారు. ఇది ఇండియన్ రైల్వేస్ లో అత్యధిక ఆదాయం. జయా వర్మ భర్త పేరు నీరజ్ సిన్హా.  ఇండియన్ పోలీస్ సర్వీస్ ఆఫీసర్. బీహార్ లోని పాట్నాలో సివిల్ డిఫెన్స్ డిజిగా పనిచేస్తున్నారు. వాళ్ల కూతురు పేరు అవనిక. ఆమె తండ్రి విబి వర్మ. తల్లి సావిత్రి. ఆమెకు ఒక సోదరుడు కూడా ఉన్నాడు. అతని పేరు జైదీప్ వర్మ. జయ వర్మ గురించి చెప్పాల్సిన మరో విశేషం కూడా ఒకటి ఉంది.  సాధారణంగా రైల్వే బోర్డు ఛైర్మన్ బాధ్యతలు చేపట్టిన వాళ్లు చాలా పెద్దవయస్కులు. కానీ జయ మటుకు ఈ అత్యున్నత పదవిని 60 ఏళ్ల వయసులో చేబట్టారు. ఆమెలోని కష్టపడే తత్వమే అరవై ఏళ్ల వయసులోనే ఇంతటి అత్యున్నత పదవిని అధిరోహించేట్టు చేసిందంటారు జయ సన్నిహితులు. జయ తండ్రి వర్మ కాగ్ కార్యాలయంలో పెద్ద అధికారిగా పదవీ విరమణ పొందారు. సోదరుడు జైదీప్ వర్మ యుపి రోడ్ వేస్ లో ఉన్నత అధికారిగా పదవీ విరమణ చేశారు. ప్రస్తుతం ఆయన లక్నోలో ఉంటున్నారు.

జయ అలహాబాద్ విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేషన్ చదివారు. అలహాబాద్ జిల్లాలోని సెయింట్ మెరీస్ కాన్వెంట్ లో పాఠశాల విద్యను అభ్యసించారు. గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో అడ్డాన్స్డ్ మేనేజ్మెంట్ అండ్ హయ్యర్ మేనేజ్మెంట్ లో మాస్టర్స్ డిగ్రీ తీసుకున్నారు.  1988లో ఇండియన్ రైల్వేస్ ట్రాఫిక్ సర్వీస్ బ్యాచ్ లో చేరి రైల్వేస్ లో తన అలుపెరుగని ప్రయాణాన్ని కొనసాగించారు. 166 సంవత్సరాల రైల్వే బోర్డు చరిత్రలో తొలి మహిళా ఛైర్మన్ గా, రైల్వేస్ సిఇవొగా బాధ్యతలు చేబట్టిన జయ వాటిని నెరవేర్చడంలో, భారత రైల్వేస్ ను ప్రపంచస్థాయిలో ప్రధమస్థానంలో నిలిపేలా తన విధులు ఎంతో నేర్పుతో నిర్వహిస్తారనడంలో ఎవ్వరికీ ఎలాంటి సందేహం లేదు. తన పేరే తన విశేషణంగా నిరూపించుకోవడంలో ఇన్నాళ్లూ జయావర్మ ఎంత సక్సెస్ ఫుల్ గా నిలిచారో అందరికీ తెలుసు. అలాగే ఈ అత్యున్నత పదవిలోనూ తన సామర్థ్యాన్ని ఆమె నిరూపించుకుంటారనడంలో ఎవ్వరికీ ఎలాంటి అనుమానాలు లేవు…రైల్వేస్ గమనంలో, వేగంలో, భద్రతలో, విజయాలలో ఇండియన్ రైల్వేస్ ఎపుడూ ముందుకు దూసుకుపోయే గ్రీన్ సిగ్నల్. ఇండియన్ రైల్వేస్ తొలి సిఇవొ.. ఛైర్మన్ అయిన జయావర్మ ప్రమాదాలకు తావులేని వేగంతో, భద్రతకు చిరునామాగా ఇండియన్ రైల్వేస్ ను ప్రపంచ పటంలో తప్పకుండా నిలబెడతారని ఆశిద్దాం. ఆమెకు అందరం బెస్ట్ విషస్ చెబుదాం…

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News