Friday, May 10, 2024
Homeఫీచర్స్Sankarpalli: పాఠాలే కథలుగా చెప్పి..బెస్ట్ టీచర్ అవార్డ్..

Sankarpalli: పాఠాలే కథలుగా చెప్పి..బెస్ట్ టీచర్ అవార్డ్..

టీచర్లు ఇలా టీచ్ చేస్తే చదువంటే ఆసక్తి వస్తుంది

పుస్తకాల్లోని పాఠాలను పాటలు, కథలుగా మార్చి చెప్పడం ఆమె ప్రత్యేకత. ఆ వినూత్న బోధనతో విద్యార్థుల మనసుతో పాటు అనేక అవార్డులూ గెలుచుకున్నారు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ నెల అక్టోబర్ 5న శంకర్‌ పల్లి పట్టణ కేంద్రంలో గల బద్దం సురేందర్ రెడ్డి గార్డెన్స్ లో జరిగిన కార్యక్రమంలో ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి, ఎంపీడీవో వెంకయ్య గౌడ్, ఎంఈఓ సయ్యద్ అక్బర్ చేతులమీదుగా అవార్డు అందుకున్నారు. ఆమె.. మండల పరిధి ఎల్వరి గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు. ఉత్తమ పురస్కారం అందుకున్న నేపథ్యంలో ఏమన్నారో… ఆమె మాటల్లోనే.

- Advertisement -

ఇద్దరు ఉపాధ్యాయులే: రంగారెడ్డి జిల్లా నార్సింగి మున్సిపాలిటీ మా స్వగ్రామం. నేను పుట్టింది పెరిగింది అంతా అక్కడే. నాన్న సుధాకర్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగి. చుట్టు పక్కల పిల్లలు ఇంటికి వచ్చి నాన్న, అమ్మ ఉమతో పాఠాలు చెప్పించుకునేవారు. వాళ్లతో నాన్నకున్న అనుబంధం చూసి ముచ్చటేసేది. ఆయన బోధన విధానం, సమాజంలో గౌరవం చూసి పెద్దయ్యాక ఉపాధ్యాయురాలిగా స్థిరపడాలని నిర్ణయించుకున్నా. మా తల్లిదండ్రులకు ముగ్గురు సంతానం. ఇద్దరు అన్నయ్యలు, శ్రీధర్ రెడ్డి, రాజేందర్ రెడ్డి. భర్త వెంకట్ రెడ్డి శేరిలింగంపల్లిలోని కేశవ నగర్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు. ఇంటర్ తర్వాత 2005లో తాండూరు మండల మల్ రెడ్డి పల్లి గ్రామానికి చెందిన వెంకట్ రెడ్డితో వివాహమైంది. భర్త వెంకట్ రెడ్డి ప్రోత్సాహంతో బిఎస్సి డిగ్రీ 2008లో పూర్తిచేసి, తర్వాత డిఈడీ 2012 లో చేశా. 2012 లో ఉపాధ్యాయ ఉద్యోగం సాధించా. ఉద్యోగం చేస్తూనే ఎమ్మెస్సీ పూర్తిచేశా. సంతానం ఇద్దరమ్మాయిలు.

అలా…ఆసక్తిగా…

2012 నుంచి శంకర్‌పల్లి మండల ఎల్వర్తి ప్రాథమిక పాఠశాలలో 11 సంవత్సరాల నుండి బోధిస్తున్నా. కొవిడ్ సమయంలో ఉపాధ్యాయులతో కలసి విద్యార్థులకు తగు జాగ్రత్తలు రూపొందించాం. పిల్లలకు కథలు, గేయాలు, యోగా చెప్తే ఆసక్తిగా నేర్చుకునేవారు. పిల్లలు వచ్చినా సరిగా కూర్చునేవారు కాదు. చాలా అల్లరి చేసేవారు. బాగా ఆలోచించి వారి అల్లరినే పాటగా వినిపించా. వారికి నచ్చడంతో బుద్ధిగా కూర్చొని మళ్లీ మళ్లీ పాడమనేవారు. విద్యార్థులకు డాన్స్ నేర్పించడం కోసం నేను నా కుతురి దగ్గర డాన్స్ నేర్చుకున్నాను. ఇప్పుడు పాఠశాలలో నేను డాన్స్ టీచర్ ని కూడా.

భర్త ప్రోత్సాహంతో…

ఇక్కడ చదువుతున్న పిల్లలు చాలా పేదవారు. వారి పరిస్థితి చూసి ప్రతి సంవత్సరం మా ఇద్దరు పిల్లల పుట్టిన రోజులకు నోటు పుస్తకాలు, స్టేషనరీ పంపిణీ చేస్తాను. ఇంకా పెద్దమొత్తంలో సహాయం చేయడానికి ఎవరైనా ముందుకు వస్తారని చాలా మందిని అడిగాను. కాని ఎవరూ రాలేరు. భర్త వెంకట్ రెడ్డి సహాయ, సహకారంతో నేనే స్కూలుకి పెయింటింగ్ చేయించాను. మాకు పరిచయం ఉన్న వ్యక్తి శ్రీనివాస్ రెడ్డి (నారాయణ స్కూల్స్ మరియు కాలేజ్ ల డీన్) పాఠశాలను సందర్శించి, అక్కడి పిల్లల పరిస్థితికి చలించి 80 మంది విదార్థులకు సరిపోయేలా బ్యాగులు స్టేషనరీ పంపిణీ చేయించాను. 2022 లో మండల స్థాయి టిఎల్ఎం మేలాలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ఆంగ్లంలో అందుకున్నా. తాజాగా మండల స్థాయి అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. దీంతో నా బాధ్యత మరింత పెరిగింది. నాన్న, నా గురువుల ప్రోత్సాహంతో ఈ స్థాయిలో ఉన్నా.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News