కర్ణాటకలో హనీ ట్రాప్(Honey Trap) వివాదం తీవ్ర దుమారం రేపుతోంది. రాష్ట్రంలో మంత్రులు సహా ముఖ్య నేతలే లక్ష్యంగా ‘హనీ ట్రాప్’ కొనసాగుతోందని ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారాన్ని అసెంబ్లీ(Karnataka Assembly)లో బీజేపీ సభ్యులు లేవనెత్తడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ అంశంపై సీబీఐ దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. హనీ ట్రాప్‌పై విచారణను పక్కనపెట్టి ప్రభుత్వం ముస్లిం కోటా బిల్లును పాస్ చేయడాన్ని విమర్శిస్తూ స్పీకర్ పోడియం వద్ద నిరసన తెలిపారు. బీజేపీ సభ్యుల తీరుపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఈ పరిణామాల నేపథ్యంలో 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలను ఆరు నెలల పాటు సస్పెండ్ చేస్తూ స్పీకర్ యూటీ ఖాదర్ నిర్ణయం తీసుకున్నారు. సస్పెన్షన్‌కు గురైన ప్రతిపక్ష ఎమ్మెల్యేల్లో మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ సీఎన్ అశ్వథ్ నారాయణ్ కూడా ఉన్నారు. సస్పెండైన ఎమ్మెల్యేలను మార్షల్స్ బలవంతంగా బయటకు తరలించారు. కాగా రాష్ట్రానికి చెందిన అనేకమంది రాజకీయ నేతలు హనీ ట్రాప్‌లో చిక్కుకుపోయారని కర్ణాటక సహకార శాఖ మంత్రి కేఎన్ రాజన్న ఇటీవల అసెంబ్లీలో పేర్కొనడం తీవ్ర చర్చనీయాంశమైంది.