Friday, May 10, 2024
Homeఓపన్ పేజ్Biju Patnaik: భూమిపుత్ర బిజూ పట్నాయక్

Biju Patnaik: భూమిపుత్ర బిజూ పట్నాయక్

ప్రధాని పదవినే వద్దన్న లెజెండరీ లీడర్

భారత దేశానికి తూర్పున ఉండే ఒడిశా రాష్ట్రం పేరు వినగానే మనకు చటుక్కున గుర్తుకు వచ్చేది యునెస్కో గుర్తింపు పొందిన కోణార్క్ సూర్య దేవాలయం మరియు ‘ఒడిస్సీ’ నృత్యం. అయితే ఆధునిక ఒడిశా నిర్మాత, స్వాతంత్ర్య సమర యోధుడు, స్వాతంత్య్రానికి పూర్వం మరియు స్వాతంత్ర్యానంతరం పైలట్‌గా దేశానికి విశేష సేవలు అందించి ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకుని “బిజూ పట్నాయక్” గా పిలవబడే “బిజయానంద పట్నాయక్” రెండు పర్యాయాలు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సేవలందించారన్న విషయం నేటి తరానికి చెందిన చాలా మందికి తెలియకపోవచ్చు. అత్యంత ప్రజాదరణ పొందిన ప్రస్తుత ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తండ్రిగానే ఆయన చాలా మందికి తెలుసు. ఆయనను ఒడిశా ఉక్కు మనిషి, కళింగ పుత్ర, భూమి పుత్ర మరియు బిజు బాబు అని కూడా ఆప్యాయంగా సంబోధిస్తారు. అయన జయంతిని పురస్కరించుకుని ఒడిశా ప్రభుత్వం ప్రతి సంవత్సరం మార్చి 5న అధికారికంగా “పంచాయతీరాజ్ దినోత్సవం” నిర్వహిస్తుంది. మొట్టమొదటి సారి 1946లో బిజూ పట్నాయక్ ఉత్తర కటక్ నియోజకవర్గం నుండి ఒడిశా శాసనసభకు పోటీ లేకుండా ఎన్నికయ్యారు. ఆయన 1961 నుండి 1963 వరకు తిరిగి 1990 నుండి 1995 వరకు రెండు పర్యాయాలు ఒడిశా ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 1977 నుండి 1985 వరకు కేంద్రపారా నియోజకవర్గం నుండి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహించిన ఆయన 1977 నుండి 1979 వరకు కేంద్ర ఉక్కు మరియు గనుల శాఖా మంత్రిగా, 1979 నుండి 1980 వరకు ప్రప్రథమ కేంద్ర బొగ్గు శాఖా మంత్రిగా ఉన్నారు.

- Advertisement -

జాతీయ భావాలు:

1927లో మహాత్మా గాంధీ కటక్ సందర్శన సందర్భంగా బిజూ తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ బ్రిటిష్ పోలీసు అధికారి అడ్డుకోవడంతో ఆయనను చూడలేక ఏడుస్తూ తిరిగి వచ్చిన కొడుకును చూసి తండ్రి లక్ష్మీనారాయణ్ “ఇలా ఏడుస్తూ వెనుదిరిగే బదులు, ఆ తెల్ల ఎస్పీ చెంప చెల్లుమనిపించి ఉండుంటే సంతోషించేవాడిని” అన్న మాటలు చిన్నారి బిజూని ఎంతో ప్రభావితం చేశాయి. 1936లో రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో చేరి పైలట్ (Royal Indian Air Force – RIAF)గా విధులు నిర్వహిస్తున్నప్పటికీ, బిజూ పట్నాయక్ విధేయత భారత స్వాతంత్ర్య పోరాటం పట్ల ఉండేది. సెలవురోజుల్లో అతను స్వాతంత్ర్య సమరయోధులను రహస్య సమావేశాలకు తరలించేవారు. RIAF ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ కమాండ్ అధిపతిగా, ఆయన ఆనాటి దిగ్గజాలైన జయ ప్రకాష్ నారాయణ్, రామ్ మనోహర్ లోహియా మరియు అరుణా అసఫ్ అలీ లకు తన ఇంటిలో ఆశ్రయం కల్పించారు. యాంగన్ నుండి బ్రిటీష్ వారిని సురక్షితంగా తరలిస్తున్నప్పుడు, అతను ఇండియన్ నేషనల్ ఆర్మీ కి మద్దతునిచ్చే కరపత్రాలను జారవిడిచారు. అది తెలిసిన బ్రిటీష్ అధికారులు ఆయనను జనవరి 13, 1943 న నిర్బంధించి రెండేళ్లపాటు ఫిరోజ్ పూర్ కోట జైలులో ఉంచారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బిజూ పట్నాయక్ సైకిల్ మీద సచివాలయానికి వెళ్లేవారు. రావెన్‌షా కాలేజీలో చదువుకుంటున్న రోజులలో ఆయన తన ఇద్దరు స్నేహితులతో కలిసి ‘విజిట్ ఇండియా మిషన్’పై కటక్ నుండి పాకిస్తాన్ లోని పెషావర్ కు సైకిల్‌పై వెళ్లారు.

ఆధునిక ఒడిశా నిర్మాత:

ఒడిషాను వ్యవసాయాధిపత్య భూస్వామ్య ఆర్థిక వ్యవస్థ నుండి పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మార్చాలని కలలుగన్న గొప్ప దార్శనికుడు బిజూ పట్నాయక్. 1975లో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రధాని ఇందిరా గాంధీ నిరంకుశ పాలనను వ్యతిరేకిస్తూ అరెస్టయ్యి 1977లో జైలు నుంచి విడుదలైన నాయకులలో బిజూ పట్నాయక్ ఒకరు. ఆయన కళింగ ట్యూబ్స్, కళింగ ఎయిర్‌లైన్స్, కళింగ ఐరన్ వర్క్, కళింగ రిఫ్రాక్టరీస్ మరియు కళింగ అనే వార్తాపత్రికలను స్థాపించారు. 1966లో, పారాదీప్ ఓడరేవు నిర్మాణానికి నిధులు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరించినప్పుడు, బిజూ పట్నాయక్ “నేను రాష్ట్ర ప్రభుత్వ నిధులు మరియు నా స్వంత డబ్బుతో ఓడరేవును నిర్మిస్తాను” అని పేర్కొనడం రాష్ట్రాభివృద్ధి పట్ల అతని నిబద్ధతను సూచిస్తుంది.

వాయుసేనాని:

1930లో ఢిల్లీ ఫ్లయింగ్ క్లబ్‌లో శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత 1936లో బిజూ పట్నాయక్ రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో చేరారు. 1941లో రెండవ ప్రపంచ యుద్ధంలో పాలుపంచుకున్న జపాన్ ద్వారా మయన్మార్లో బంధింపబడిన కొంతమంది బ్రిటీష్ కుటుంబీకుల విడుదల కోసం ఆయన ప్రదర్శించిన ధైర్యసాహసాలను కొనియాడిన బ్రిటిష్ పాలకులు ఆయనను సత్కరించారు. చైనా మరియు రష్యాలకు సామాగ్రి చేరవేతలో ఆయన చురుగ్గా పాల్గొన్నారు. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో మయన్మార్‌ తో పోరాడుతున్న భారత సైనికులకు మద్దతుగా ఆయన విమానం నుండి సుభాష్ చంద్ర బోస్ ద్వారా ఏర్పాటైన ఇండియన్ నేషనల్ ఆర్మీ యొక్క కరపత్రాలను విసిరారు. ఆ సమయంలో స్వాతంత్ర్య సమరయోధులను ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి తరలించడంలో తోడ్పాటునందించారు. 1962లో చైనా-భారత్ యుద్ధం సందర్భంగా తనకు అత్యంత సన్నిహితుడిగా పరిగణింపబడే బిజూ పట్నాయక్‌ను నాటి భారత ప్రధాని నెహ్రూ సంప్రదించడం విశేషం. బిజూ పట్నాయక్ పైలట్‌గా సాహసకృత్యాలకు (Daredevil Acts) కు ప్రసిద్ధి చెందారు. 1947లో స్వాతంత్ర్యానంతరం భారత్-పాకిస్తాన్ ల మధ్య జరిగిన కాశ్మీర్ యుద్ధం సమయంలో 1-సిక్కు రెజిమెంట్‌ కు చెందిన 17 మంది సైనికులను సురక్షితంగా ఢిల్లీకి తీసుకురావడానికి బిజూ పట్నాయక్ తన డకోటా DC-3 విమానంతో అతి తక్కువ ఎత్తులో రాడార్ ల దృష్టికి చిక్కకుండా ప్రయాణించడం ఆయన సాహసానికి ఉదాహరణ. ఇండోనేషియా స్వాతంత్ర్య పోరాటంలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. ఆయన జూలై 1947లో డచ్ సాయుధ బలగాల కళ్ళుగప్పి, ఇండోనేషియా గగనతలంలోకి ప్రవేశించి జకార్తా సమీపంలో దిగి నాటి భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూతో రహస్య సమావేశం కోసం అప్పటి ఇండోనేషియా అధ్యక్షుడు అచ్మద్ సుకర్ణో (Achmad Sukarno) మరియు మాజీ ప్రధాని సుతాన్ స్జహ్రీర్‌లను (Sutan Sjahrir) న్యూఢిల్లీకి తరలించారు. ఈ సందర్భంగా ఆయన ప్రదర్శించిన అసమాన ధైర్య సాహసాలకు గాను విదేశీయులకు చాలా అరుదుగా ఇచ్చే ఇండోనేషియా అత్యున్నత పురస్కారమైన ‘భూమి పుత్ర’ అవార్డు లభించింది. 1947లో ఆయన స్థాపించిన కళింగ ఎయిర్ లైన్స్ సంస్థను భారత ప్రభుత్వం 1953లో జాతీయం చేసి ఇండియన్ ఎయిర్‌లైన్స్‌లో విలీనం చేసింది. 1947లో కళింగ ఎయిర్‌లైన్స్ కు చెందిన DC-3 విమానాలు ప్రధానంగా కాశ్మీర్‌లో మోహరించిన సైనిక దళాలు మరియు సామాగ్రి రవాణా కోసం ఇతోధిక సహాయం చేసాయి.

తిరస్కరించిన ప్రధానమంత్రి పదవి:

1989లో ప్రధానమంత్రి పదవికి ముందంజలో ఉన్నవారిలో బిజూ పట్నాయక్ పేరు కూడా ఉన్నప్పటికీ, ఆయన ఆ పదవిని చేపట్టడానికి విముఖత చూపడంతో అప్పటి జనతాదళ్ చీఫ్ విశ్వనాథ్ ప్రతాప్ సింగ్‌ను దేశ ప్రధానమంత్రి పదవి వరించిందని అంటారు. అంతేకాదు 1996లో దేశంలో రాజకీయ సంక్షోభం ఏర్పడి కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రతిపక్ష పార్టీల మధ్య చర్చలు జరిగిన సందర్భంలో జనతాదళ్, తెలుగుదేశం పార్టీతో సహా పలువురు ప్రతిపక్ష నేతలు బిజూ పట్నాయక్ పేరును ప్రధాని పదవికి ప్రతిపాదించిననప్పటికీ, తనకు జాతీయ రాజకీయాలపై ఆసక్తి లేదని, ఒడిశా అభివృద్ధికి కృషి చేయడానికే ఇష్టపడతానని పేర్కొంటూ ఆ ప్రతిపాదనను ఆయన తిరస్కరించారని అంటారు. నెహ్రూ జీవిత చరమాంకంలో ఒక అమెరికన్ జర్నలిస్ట్ వెల్లెస్ హాంగెన్ రచించిన “ఆఫ్టర్ నెహ్రూ హూ” అనే పుస్తకంలోనే కాకుండా మరికొందరు కూడా బిజూ పట్నాయక్‌ పేరు పేర్కొనడం ఆయన దక్షతకు నిదర్శనంగా నిలుస్తుంది.

పురస్కారాలు:

1995లో తమ 50వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇండోనేషియా ప్రభుత్వం ఆయనను విదేశీయులకు అరుదుగా ఇచ్చే “బింటాంగ్ జాసు ఉతమా” మరియు “భూమి పుత్ర” పురస్కారాలతో పాటు ఆ దేశ గౌరవ పౌరసత్వంతో సత్కరించింది. అంతేకాదు 1950లో ఇండోనేషియా ప్రభుత్వం ఆయనకు కొంత అటవీ భూమి మరియు విలాసవంతమైన భవనాన్ని బహుమతిగా ఇచ్చినప్పటికీ ఆయన దానిని స్వీకరించలేదు. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో జవహర్‌లాల్ నెహ్రూ సూచన మేరకు నాజీ సేనలకు వ్యతిరేకంగా రష్యా సైనికులను రక్షించేందుకు సహాయం అందించినందుకు రష్యా ప్రభుత్వం ఆయనను “ఆర్డర్ ఆఫ్ లెనిన్” పౌర పురస్కారంతో సత్కరించింది.

మూడు జాతీయ పతాకాలతో అరుదైన గౌరవం:

దార్శనికత, జాతీయ భావాలు మూర్తీభవించిన రాజకీయ నాయకుడిగా, వాయుసేనానిగా, మానవతావాదిగా, ఆధునిక ఒడిశా రాష్ట్ర నిర్మాతగా భారత దేశంతో పాటు ఇండోనేషియా మరియు రష్యాలకు బిజూ పట్నాయక్ అందించిన నిరుపమాన సేవలకు గౌరవసూచకంగా 17 ఏప్రిల్ 1997న మరణించిన ఆయన భౌతిక కాయంపై మూడు దేశాలు జాతీయ పతాకాలను ఉంచి తమ కృతజ్ఞతాభావాన్ని చాటుకున్నాయి. బహుశా ప్రపంచంలోనే ఇంతటి అరుదైన గౌరవం ఏ నాయకుడికి దక్కలేదేమో !

యేచన్ చంద్ర శేఖర్

మాజీ రాష్ట్ర కార్యదర్శి

ది భారత్ స్కౌట్స్ & గైడ్స్, తెలంగాణ

హైదరాబాద్

✆ 8885050822

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News